హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే ఆ మంత్రి పదవి పోతుంది: జగ్గారెడ్డి

Dubbaka ByPolls: దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే ఆ మంత్రి పదవి పోతుంది: జగ్గారెడ్డి

జగ్గారెడ్డి (File- credit - twitter)

జగ్గారెడ్డి (File- credit - twitter)

దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సీఎం పీఠం ఇచ్చినట్టేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోయినా కారు పార్టీ గెలిస్తే కేసీఆర్ కాలర్ ఎగరేస్తారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరని జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దుబ్బాక లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరం. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంది. దుబ్బాక లో కాంగ్రెస్-బీజేపీ-టీఆర్ఎస్ మధ్యే పోటీ. రూలింగ్ పార్టీ కావడం వల్ల టీఆర్ఎస్ కు చాలా అనుకూలతలు ఉంటాయి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల పోలింగ్- ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ గెలిచినట్లు ప్రకటన చేస్తున్నారు. దుబ్బాక లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయింది.. మెజారిటీ మాత్రమే అంటూ మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కలెక్టర్, పోలీసులు టీఆర్ఎస్‌కు ప్రచారం చేస్తున్నారు.’ అని జగ్గారెడ్డి అన్నారు.

  రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల అన్ని పంటలు నాశనం అయ్యాయని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎమ్మెల్యేలు- ప్రజాప్రతినిధులు ఉన్నారని, కానీ తెలంగాణలో అంతా రివర్స్ నడుస్తోందన్నారు. ‘రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాకలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి టీఆర్ఎస్ ను ఓడించమని చెప్పండి. ఉస్మానియా- కాకతీయ విద్యార్థులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అన్నారు కదా. ఇప్పటికీ వారికి ఉద్యోగాలు రాలేదు. ఇప్పుడైనా మేల్కొండి. దుబ్బాక లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ వరదలు వస్తాయి.’ అని జగ్గారెడ్డి అన్నారు.

  దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు దుబ్బాకలో దొంగమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక లో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావుకు మంత్రి పదవి ఉండదన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితం ముడిపడి ఉందన్నారు.

  దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బిగ్‌బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. మరో నలుగురు అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి బరిలో నిలిచారు. ఇక, మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

  ఇక, నవంబర్ 3వ తేదీన దుబ్బాకలో పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆ వేడి మరింత పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల దాడి కొనసాగుతుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Jagga Reddy, Telangana, Trs, TS Congress

  ఉత్తమ కథలు