హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది అరెస్ట్

Dubbaka ByPolls: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది అరెస్ట్

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఓ హవాలా కేసులో కోటి రూపాయలు డబ్బు పట్టుకున్నామని, అందులో ఇద్దరినీ అరెస్టు చేశామని అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాస్ రావును అరెస్టు చేశాం. ఇతను చందా నగర్ కు చెందిన వ్యక్తి. మరో వ్యక్తి రవి కుమార్ (కార్ డ్రైవర్) మీద అరెస్ట్ చేసాం. ఇన్నోవా కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఫోన్ లో చాలా కీలక సమాచారం సేకరించాం. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘునందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు. రఘునందన్ రావు బావ మరిది శ్రీనివాస్ కు విశాఖ ఇండస్ట్రీ నుంచి కోటి రూపాయలు అందాయి. వాటిని హైదరాబాద్ మీదుగా దుబ్బాక తీసుకెళ్తున్నారు.’ అని అంజనీ కుమార్ తెలిపారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడూ కృత నిశ్చయంతో వుంటారని చెప్పారు.

  కొన్ని రోజుల క్రితం రఘునందన్‍ రావు మామ రాంగోపాల్‍ రావు మరో బంధువు అంజన్‍ రావు ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అంజన్‍ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67 లక్షలు లభించాయి. ఈ సమాచారం తెలియగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్‍ రావు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అంజన్‍ రావు ఇంటికి చేరుకొని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట కూడా జరిగింది. ఈ తోపులాటలో రఘునందన్‍ రావు సొమ్మసిల్లి కిందపడిపోయారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.12 మొత్తాన్ని బీజేపీ శ్రేణులు లాక్కెళ్లాయని ఆ తర్వాత పోలీసులు చెప్పారు. అంజన్‍ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసుల సోదాలు బీజేపీ కార్యకర్తల హల్‍ చల్‍ తోపులాట డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‍ రెడ్డి స్వయంగా సిద్దిపేటకు వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‍షా ఢిల్లీ నుంచి ఫోన్‍ చేసి పరిస్థితులపై ఆరాతీశారు.

  ఎన్నికల కోడ్‍ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదా చేసి పట్టుకున్నామని పోలీసులు చెబుతుండగా.. పోలీసులే డబ్బులు తెచ్చి పెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు ప్రతివిమర్శలు నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నికల వేడి మరింత రాజుకుంది. తమ అత్త గారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‍ రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య కూతురు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే, పోలీసులే డబ్బులు పెట్టారన్న ఆరోపణలను పోలీస్ కమిషనర్ ఖండించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Hyderabad police, Telangana, Telangana bjp

  ఉత్తమ కథలు