హోమ్ /వార్తలు /national /

Huzurnagar Bypoll | హుజూర్ నగర్‌ ఉప ఎన్నికపై న్యూస్‌18 గ్రౌండ్ రిపోర్ట్..

Huzurnagar Bypoll | హుజూర్ నగర్‌ ఉప ఎన్నికపై న్యూస్‌18 గ్రౌండ్ రిపోర్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల మనోగతం మాత్రం మిశ్రమంగా కనిపిస్తోంది.

నువ్వా నేనా అన్నట్టు సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగే జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హుజూర్ నగర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి సన్నిహితుడు, ఎన్ఆర్ఐ సైదిరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, తెలుగుదేశం పార్టీ నుంచి కిరణ్మయి, బీజేపీ నుంచి డాక్టర్ రామారావు బరిలో నిలిచారు. వీరితో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు హుజూర్ నగర్ బరిలో నిలిచారు. అయితే.. ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 7466 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ సారి సైదిరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తం కుటుంబానికి లాభం... టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభం అనే నినాదంతో ప్రచారం నిర్వహించింది.

ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్.... తన బలగాలను ప్రచార బరిలోకి దింపింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు రోడ్ షో నిర్వహించి తన పంచ్ డైలాగులతో విపక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నాయకులు హూజూరాబాద్ లో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. అయితే... ఈ నెల 17 న నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో పార్టీ శ్రేణులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో హుజూర్ నగర్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలన్న కసి కనిపించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యను గెలిపించుకునేందుకు సర్వ శక్తులొడ్డారు. వివాదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరులతో పాటు, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల నేతలు ప్రచారం నిర్వహించి పద్మావతిని గెలిపించేందుకు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే వంద మందిలో ఒకరవుతారు... కాంగ్రెస్ గెలిస్తే ప్రశ్నించే గొంతుకవుతారని కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని విమర్శించారు. మూడు సార్లు తనకు పట్టం కట్టిన హుజూర్ నగర్ ప్రజలు ఈ సారి కచ్చితంగా 30 వేల మెజారిటీ కట్టబెడతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించినా... ఓటర్లను ఆకర్శించే స్థాయిలో మాత్రం కనిపించలేదు.

అయితే... ఈ సారి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. నోటిఫికేషన్ వెలువడగానే స్థానిక ఎస్పీని బదిలీ చేసి కొత్త అధికారని నియమించింది. దీంతో పాటు ప్రత్యేక పరిశీలకున్ని కూడా నియమించింది. ఈసీ అభ్యర్థుల ఖర్చు, డబ్బు,మద్యం పంపిణీలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో పార్టీలు రెగ్యులర్ పోల్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.

ఇక... గతంలో కమ్యూనిస్టులను తోక పార్టీలని విమర్శించిన టీఆర్ఎస్ ఈ సారి హూజూర్ నగర్ ఎన్నికల్లో సీపీఐ మద్ధతు కోరింది. అధికార పార్టీ అభ్యర్థనను సానుకూలంగా స్పందించిన సీపీఐ మద్ధతు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే.. రాష్ట్రంలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తమ మద్ధతు వెనక్కి తీసుకుంది.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు... టీఆర్ఎస్ ఎన్నికల గుర్తయిన కారును పోలిన రోడ్ రోలర్, ఆటో తదితర గుర్తులను కూడా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఈ గుర్తులో గత ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయని భావించిన టీఆర్ఎస్ సదరు గుర్తులు ఎవరకీ కేటాయించకూడదని ఈసీ అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే... ఓటర్ల మనోగతం మాత్రం మిశ్రమంగా కనిపిస్తోంది. “గతంలో మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చాం... ఈ సారి సైదిరెడ్డికి ఇచ్చి చూస్తాం.” అని రామి రెడ్డి అనే ఓటరు చెప్పారు. “గతంలో మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేసే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ సారి కూడా ఆయనకే ఓటేస్తాం... పోరాటం చేసయినా నియోజవర్గానికి నిధులు తెస్తారు.” అని మాధవి అనే మరో ఓటరు అభిప్రాయపడ్డారు. “గతంలో ఉత్తమ్ తాను గెలిస్తే ముఖ్యమంత్రి అవుతానని ఓట్లడిగారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కేంద్రమంత్రిని అవుతానని ఎంపీగా గెలిచారు. ఏదీ కాలేదు. ఇంకా ఇప్పటికిప్పుడూ ఏమీ అయ్యే అవకాశం లేదు.” అని బండ రాజేశ్వర్ చెప్పుకొచ్చారు.

అయితే... మూడూ సార్లు హూజూర్ నగర్ ను కైవసం చేసుకున్న పార్టీ ఓ వైపు... అధికార పార్టీ మరో వైపు సాగుతున్న పోరు మాత్రం ఉత్కంఠభరితంగానే కనిపిస్తోంది.

“గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో ఉత్తమ్ పై ఆ కృతజ్ఞత ఉంది. అయితే... సైదిరెడ్డిని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ నాయకుల్ల సమన్వయం లోపించింది. కేసీఆర్ సభ జరగకపోవడం ఆ పార్టీకి మైనస్. బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువే అయినా సామాజిక సమీకరణాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఆర్టీసీ సమ్మె కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పోటీ మాత్రం హోరాహోరీగా ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేం కానీ.. ఎవరు గెలిచినా మెజారీటీ పది వేల లోపే ఉంటుంది. ” అని స్థానిక పాత్రికేయులు దొమ్మాటి విజయ భాస్కర్ విశ్లేషించారు.

మరోవైపు... ఈ సారి స్థానికంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీ కలిసి పని చేశాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫిర్యాదు చేయగానే ఎన్నికల అధికారులు తక్షణం కట్టడి చేశారనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకు పట్టం కడతారా... లేదంటే అధికార పార్టీ అభివృద్ధి మంత్రానికి ఆకర్శితులవుతారా అనే అంశం తేలాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందే.

(హుజూర్‌నగర్ నుంచి న్యూస్‌18 ప్రత్యేక ప్రతినిధి)

First published:

Tags: Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, News18, Telangana, Telangana bjp, Trs, TS Congress, Uttam Kumar Reddy

ఉత్తమ కథలు