సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తొలి నుంచి గందగోళంగానే ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వార్త రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై హల్చల్ చేస్తూనే ఉన్నప్పటికీ.. ఆయన నుంచి ఎలాంటి స్ఫష్టత రావడం లేదు. తాజాగా ప్రముఖ రాజకీయ వ్యాఖ్యత, తమిళ మ్యాగ్జైన్ తుగ్లక్ ఎడిటర్ ఎస్ గురుమూర్తి రజజనీకాంత్తో భేటీ అయ్యారు. ఆదివారం పొయాస్ గార్డెన్లో రజనీకాంత్ నివాసానికి వెళ్లిన గురుమూర్తి ఆయనతో దాదాపు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గురుమూర్తి.. రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలవడంతో ఈ భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేయకపోయినప్పటికీ బీజేపీకి మద్దత్తిస్తారని ఓ వర్గం ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తమిళనాట ఈ భేటీ పలు రాజకీయ ఊహాగానాలకు తెరతీసింది.
ఇక, వారిద్దరి సన్నిహితులు మాత్రం రజనీకాంత్ గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారని, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెబుతున్నారు. అయితే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇటీవల పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సమయంలోనే గురుమూర్తి వచ్చి ఆయనను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఇటీవల రజనీ పేరుతో వెలువడిన ఓ లెటర్ తెగ వైరల్‌గా మారింది. కరోనా నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని ఆ లేఖ సారాంశం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత నెలకొనడంతో.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే తన పేరిట ప్రచారంలో ఉన్న లేఖను రజనీకాంత్ ఖండించారు. రజనీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో కలిసి చర్చించిన తర్వాతే తాను రాజకీయాలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటానని.. అంతేకానీ, ఎవరితో చర్చించకుండా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలని భావించడం లేదని తెలిపారు. ఇక, తాజాగా రజనీకాంత్‌తో గురుమూర్తి భేటీ కావడంతో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajinikanth