హోమ్ /వార్తలు /national /

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ చుట్టూ వైసీపీ నేతల త్రిముఖ వ్యూహం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ చుట్టూ వైసీపీ నేతల త్రిముఖ వ్యూహం

వల్లభనేని వంశీ (ఫైల్)

వల్లభనేని వంశీ (ఫైల్)

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా కలిసి పనిచేయడానికి ససేమిరా అంటుున్న యార్లగడ్డ, దుట్టాకు దాసరి కూడా తోడయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరం నియోజవకర్గంలో వైసీపీ లుకలుకలు ఆగడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీని అప్పటికే వైసీపీలో ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి వ్యతిరేకంగా వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, దాసరి వర్గాలు ఒక్కటయ్యాయి. వంశీని పార్టీలో ఒంటరిని చేసి తిరిగి ఇంచార్జి అవ్వాలని యార్లగడ్డ ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి వారి మధ్య వర్గ పోరు నడుస్తుండడంతో రెండు వారాల క్రితం స్వయంగా సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఇద్దరు నేతలకు చేతిలో చెయ్యి వేసి కలసి పనిచేయాలని సూచించారు. వంశీ రాకను వ్యతిరేకించిన యార్లగడ్డకు గతంలో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా వర్గపోరు ఆగలేదు. ఇటీవల పునాదిపాడులో సీఎం జగన్‌ పర్యటించారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. సీఎం జగన్‌కు వీడ్కోలు పలికేందుకు ఎమ్మెల్యే వంశీమోహన్, మంత్రి కొడాలి నాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కలుద్దామని యార్లగడ్డ వెంకట్రావు వెళ్లగా..మంత్రి కొడాలి నాని ద్వారా ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పిలిపించారు ముఖ్యమంత్రి. వంశీ, యార్లగడ్డ సీఎం జగన్ ముందు చేతులు కలిపి మాట్లాడారు‌. విభేదాల్లేకుండా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని నేతలిద్దరికీ సీఎం సూచించారు. ఆ తర్వాత వంశీమోహన్ గన్నవరం ఇన్చార్జ్‌గా తానే ఉంటానని ప్రకటించారు. కానీ వంశీ, యార్లగడ్డ మధ్య సీఎం రాజీ కుదిర్చినా అది ఎంతో సేపు నిలవలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరిదారి వారిది అన్నట్లుగా ఇద్దరు వ్యవహరించారు.

సాక్షాతూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా కలిసి పనిచేయడానికి ససేమిరా అంటుున్న యార్లగడ్డ, దుట్టాకు దాసరి కూడా తోడయ్యారు. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో వంశీని ఏకాకిని చేసేందుకు ఆ ముగ్గురు నేతలు త్రిముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారని సాక్షాత్తూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. అయితే, వంశీకి కొవిడ్ సోకిన సమయంలో ఆ ముగ్గురూ కలసి వర్గ రాజకీయాలు చేస్తున్నారని పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్నారని వంశీ వర్గం ఆరోపిస్తోంది.

వంశీ, యార్లగడ్డ మధ్య చేతులు కలిపి వివాదాలు లేకుండా పనిచేసుకోవాలని సూచించిన జగన్

యార్లగడ్డ, వంశీ మధ్య చేయి చేయి కలిపిన తర్వాత అంతా సద్దుమణుగుతుందని భావించినా అది పరిష్కారం కాలేదు. వంశీకి వ్యతిరేకంగా ఈసారి ముగ్గురు జట్టుకట్టడంతో అది పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారింది. వంశీ కోసం ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదనే వాదన ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటూ ఉంటాయని, వాటిని పెద్దగా చూడాల్సిన పనిలేదని పార్టీలో మరికొందరు పెద్ద నేతలు వాదిస్తున్నారు. అయితే, ఇప్పటికే చీరాలలో ఆమంచి, కరణం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఇక్కడ కూడా ఆ స్థాయికి పెరుగుతుందేమోననే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తం అవుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Gannavaram, Vallabaneni Vamsi, Vallabhaneni Vamshi, Vallabhaneni vamsi, Ysrcp

ఉత్తమ కథలు