ఏపీలో పెన్షనర్లకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయించారు. కాగా, కొత్త పెంపుతో పెన్షనర్ల కరువు భత్యం 33.536 శాతానికి పెరిగింది. 2021 జులై నెల నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిసి ఫించన్లు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. అలాగే బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన మూడో డీఆర్ 5.24 శాతాన్ని.. 2022 జనవరి నెల నుంచి చెల్లించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక 2018 జూలై 1 తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంపుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి 5.24 శాతం మేర మూడో డీఆర్ పెంచింది. ఈ పెంపుతో మొత్తం 38.776 శాతానికి పెన్షనర్ల డీఏ పెరిగినట్లయ్యింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన పెన్షనర్లకు సవరించిన కరవు భత్యం రేట్లను సవరిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
డీఏ పెంపుపై ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డీఏ ఉత్తర్వులు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్ కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ సచివాలయ సంఘం, ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Pension Scheme, Pensioners