ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆదాయం తీవ్రంగా పడిపోయిందని.. కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. కేంద్రం నుంచి రావలసినవి రావడం లేదని.. ఇక్కడ ఆదాయం కూడా ఏమీ లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ గతంలోనే హెచ్చరించారని.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్ర పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింత స్పష్టత వస్తుందన్నారు. దేవుడు ఉన్నాడని తరుచూ సీఎం జగన్ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన్ను ఆశీర్వదించాలని ఉండవల్లి అన్నారు. ఇక పోలవరంపై మాట్లాడుతూ... బడ్జెట్‌లో పోలవరానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు 'మాట తప్పడు.. మడమ తిప్పడు' అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
అంతకు ముందు జగన్ మోహన్ రెడ్డికి సరికొత్త డిమాండ్ వినిపించారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... విశాఖతో పాటు అమరావతిలోనూ హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో పాటు రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక తీర్చాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
14 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్ ఈ రకమైన ఆలోచన చేశారని ఉండవల్లి సీఎం జగన్‌కు వివరించారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో ఇసుక లభించడం లేదని... కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉండవల్లి సూచించారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Undavalli Arun Kumar