గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 11న దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 11న కొత్తగా ఎన్నికైన కార్పొరేట్లు మొదట ప్రమాణస్వీకారం చేయనున్నారు. 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైన ఒక కార్పొరేటర్ మరణించడంతో 149 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి 56, ఎంఐఎంకు 44, బీజేపీకి 48, కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు 52 మంది సభ్యులు ఎక్స్ అఫీషియోలుగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో టీఆర్ఎస్ 38, ఎంఐఎం 10, బీజేపీ 3, కాంగ్రెస్ 1 సభ్యులు ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. అయితే, ఎక్స్ అఫీషియో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారిలో కేవలం 44 మందికే ఓటు కల్పించనున్నారు అధికారులు. 52 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నా కూడా వారిలో 8 మంది ఇతర మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియోలుగా తమ ఓటును వినియోగించుకున్న వారు కావడంతో వారిని జాబితా నుంచి తొలగించారు.
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నిర్వహించనున్న హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి దీనిపై సమగ్రంగా పరిశీలించారు. మేయర్ ఎన్నికలు నిర్వహించే కౌన్సిల్ హాలును పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్ల ప్రకారం ముందుగా కేబినెట్ మంత్రులను కూర్చోబెడతారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత కార్పొరేటర్లు కూర్చుంటారు. 56 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ హాలులో పూర్తి ఎడమవైపు కూర్చుంటారు. ఆ తర్వాత మధ్యలో 44 మంది ఎంఐఎం సభ్యులు మధ్యలో కూర్చుంటారు. 48 మంది బీజేపీ సభ్యులు కౌన్సిల్ కుడివైపున కూర్చుంటారు. ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీజేపీ కి పక్కన కూర్చుంటారు.
ఫిబ్రవరి 11న మొదట కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఆ తర్వాత రోజు ఫిబ్రవరి 12న మేయర్ ఎన్నిక ఉంటుంది. ఆ రోజు జీహెచ్ఎంసీకి సెలవు అయినా కూడా మేయర్ ఎన్నిక జరుగుతుంది. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 8 ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటు వేశారు కాబట్టి, ఇక్కడ వినియోగించుకునే అవకాశం లేదు. అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీలో ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయడానికి ఆస్కారం లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వై.మల్లేశం, గరికపాటి రామ్మోహన్ రావు, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు వేశారు. కాబట్టి ఇక్కడ మరోసారి వాడుకోలేరు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఓటు వేశారు కాబట్టి, ఇప్పుడు ఓటు వేయడం కుదరదు. ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి నార్సింగ్‌లో ఓటు ఇప్పటికే వినియోగించుకున్నారు. మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి బోడుప్పల్‌లో, కేపీ వివేకానంద కొంపల్లిలో తమ ఓట్లు వేశారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం మద్దతు లేకుండానే సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్ సీటు గెలుచుకోవాలని చూస్తోంది. చేతులెత్తే పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIMIM, Hyderabad - GHMC Elections 2020, Telangana, Telangana bjp, Trs