Greater Hyderabad Municipal Elections Results 2020: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 10-12 సీట్లును స్పల్ప తేడాతో కోల్పోయామని.. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందనక్కరలేదని పార్టీ వర్గాలకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్‌ను అతిపెద్ద పార్టీగా నిలబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మేయర్ పీఠంపై కూర్చునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు మంత్రి కేటీఆర్.
'' జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు మేం ఆశించిన విధంగా రాలేదు. మరో 20-25 సీట్లు అదనంగా వస్తాయని అనుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. బీఎన్‌రెడ్డిలో 18, మౌలాలిలో 200 ఓట్ల తేడాతో ఓడిపోయాం. 10-12 సీట్లలో కేవలం స్పల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈ ఫలితాలను నిరాశపడాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకు సాగుతాం. టీఆర్ఎస్‌కు ఓటువేసిన ప్రజలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు.'' అని మంత్రి కేటీఆర్ అన్నారు.
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లు గాను..రాత్రి 08.30 గంటల సమయానికి 147 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ 55 సీట్లు గెలిచింది. ఇక బీజేపీ అనూహ్యంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. ఎప్పటిలాగే పాతబస్తీలో పట్టునిలుపుకుంది మజ్లిస్. ఈసారి 43 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. మరో మూడు డివిజన్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. అందులో రెండింట బీజేపీ, ఒక చోట టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ ఓటమిపై అంతర్గత విశ్లేషణ చేసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. చివరి నిమిషంలో ఎక్కువ పోలింగ్ నమోదవడంపై అనుమానాలు ఉన్నాయని.. దాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని అన్నారు. ఇక బీజేపీ విజయాన్ని టీఆర్ఎస్‌తో కుమ్మక్కైన ఈసీకి, బీజేపీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోని డీజీపీకి అంకితం చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే... బీజేపీ మేయర్ పీఠాన్ని కూడా గెలిచేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, Telangana, Trs