హోమ్ /వార్తలు /national /

GHMC Results: ఆ ఒక్క డివిజన్‌ ఫలితం నిలిపివేత.. కోర్టు తీర్పు తర్వాతే..

GHMC Results: ఆ ఒక్క డివిజన్‌ ఫలితం నిలిపివేత.. కోర్టు తీర్పు తర్వాతే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC Elections2020: నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో నెరెడ్ మెట్ డివిజన్ ఫలితానికి బ్రేక్ పడింది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రిటర్నింగ్ అధికారి నివేదిక పంపించారు. ఐతే అంతకంటే ముందే.. టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తమ పార్టీ అభ్యర్థి మీనా రెడ్డి గెలిచిందని ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ప్రసన్న మాత్రం.. నేరెడ్‌మెట్‌లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ముద్ర విషయంలో గందరగోళం కారణంగా కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్‌ను అధికారులు నిలిపివేశారు. కోర్టు తీర్పు తర్వాతే ఫలితం వెలువడే అవకాశముంది.

బ్యాలెట్ పేపర్‌పై స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఇవాళ ఉదయం హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్వస్తిక్ మినహా ఇతర ఎలాంటి ముద్రలు ఉన్నా.. చెల్లని ఓట్లుగా పరిగణించాలని ఆదేశాలు జారీచేసింది. ఐతే గెలుపు ఓటములు డిసైడ్ చేసే ఓట్లుంటే మాత్రం.. ఆయా స్థానాల్లో ప్రత్యేక ఆదేశాలు ఇస్తామని తెలిపింది. నేరెడ్‌మెట్‌లో ఇదే పరిస్థితి నెలకొంది.

జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లు గాను..రాత్రి 9 గంటల సమయానికి 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ 55 సీట్లు గెలిచింది. ఇక బీజేపీ అనూహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. ఎప్పటిలాగే పాతబస్తీలో పట్టునిలుపుకుంది మజ్లిస్. ఈసారి 44 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. మరో డివిజన్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. అక్కడ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా, పోలింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్‌ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్‌ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని.. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. ఐతే అలాంటి ఓట్లనూ పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల అధికారులు అర్ధరాత్రి ఆదేశిలిచ్చారు. ముద్ర మారినప్పటికీ ఓటర్ల ఎంపిక మారదని పేర్కొన్నారు. అర్ధరాత్రి జారీచేసిన ఆ ఉత్తర్వులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. స్వస్తిక్ మినహా ఏ ఇతర ముద్రలు కలిగి ఉన్న ఓట్లను పరిగణలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేసింది. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఎన్నికల కమిషనర్ పార్థసారధి జారీచేసిన ఉత్తర్వులకు బ్రేకులు వేసింది.

ఏయే పోలింగ్ స్టేషన్‌లలో ఇలా జరిగిందో.. పూర్తి వివరాలు అందజేయాలని స్పష్టంచేసింది. ఐతే స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలు, టిక్ మార్క్ ఉన్న ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఆ లోపు ఎన్నికల అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలకు లోబడి.. నేరెడ్‌మెట్‌లో ఎన్నికల ఫలితాను రిటర్నింగ్ అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: GHMC Election Result, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Telangana

ఉత్తమ కథలు