బల్దియాలో మరోసారి ఎంఐఎం చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యం రాకపోవడంతో.. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం కీలకం కానుంది. మొత్తం 150 స్థానాలున్న గ్రేటర్ ఎన్నికల్లో 56 స్థానాలతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచిన మేజిక్ ఫిగర్‌కు 20 స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఎక్స్ అఫీషియో సభ్యులపైకి మళ్లింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండగా.. అందులో టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులను కలుపుకుంటే గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మంది సభ్యుల మద్దతు కావాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన అధికార టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫీషియో కలుపుకున్న మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇందుకు టీఆర్‌ఎస్ ఎంఐఎం మద్దతు తప్పనిసరి కానుంది.
గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ 52 స్థానాల్లో పోటీ చేసిన ఐఎంఎం 43 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది. అలాగే ఆ పార్టీకి 10 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నికలలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కీలకం కానున్నారు. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ఎంఐఎం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌తో కలిసి అధికారాన్ని పంచుకుంటుదా? లేక టీఆర్‌ఎస్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు బయటి నుంచి మద్దతు తెలుపుతుందా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ల మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయనే ఆసక్తి నెలకొంది.
ఇక, 2016 బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ రావడంతో.. ఆ పార్టీ అభ్యర్తి మేయర్ అయ్యారు. అయితే అంతకు ముందు 2009లో జరిగిన బల్దియా పోరులో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎంలు కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఇరు పార్టీలు మేయర్ పదవిని చేరో రెండోళ్లు పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మహ్మద్ మజీద్ హుస్సేన్ మేయర్‌గా పనిచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, MIM, Trs