గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు తీవ్ర తప్పిదం చేశారు. ఒక పార్టీ గుర్తు ముద్రించాల్సి ఉండగా, మరో పార్టీ గుర్తును ముద్రించారు. ఈ విషయాన్ని నేతలు గుర్తించి ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంతో అక్కడ పోలింగ్ రద్దు అయింది. హైదరాబాద్‌లోని 26వ డివిజన్ ఓల్డ్ మలక్ పేటలో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కానీ, అక్కడ సీపీఐ గుర్తు కంకి కొడవలి గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తు అయిన సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. దీన్ని గుర్తించిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఓటింగ్ నిలిపివేశారు. అక్కడ పోలింగ్ రద్దు అయింది. రేపు (డిసెంబర్ 2)న అక్కడ రీ పోలింగ్ జరగనుంది. ఓల్డ్ మలక్ పేటలో ఇప్పటి వరకు వినియోగించిన బ్యాలెట్ బాక్సులను సీజ్ చేస్తున్నారు. రేపు కొత్త వాటిని వినియోగించనున్నారు.
మరోవైపు గ్రేటర్‌లో ఓటర్లు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడం లేదు. ఉదయం 11 గంటల వరకు కేవలం 12శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ వద్ద మంత్రి పువ్వాడ అజయ్‌కు చెందిన కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారులోనే టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ సమయంలో మంత్రి పువ్వాడ కారులో లేరని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలు పోలింగ్ బూత్ ల దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయి. హఫీజ్ పేట్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించారు. ఆర్కేపురం పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPI, CPM, Hyderabad - GHMC Elections 2020