అసెంబ్లీ( Telangana Assembly)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటన (Telangana Jobs)తో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు మొదలైందని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు (Finance Minister Harish Rao) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బడ్జెట్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచనలు చేస్తారని తాను అనుకున్నానని హరీశ్ పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు తప్పా ఎలాంటి సూచనలు చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాస్తవాలు మాట్లాడితే మంచిదని హరీష్ రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారని, తెలంగాణలోని పల్లెలు అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యిందని అసెంబ్లీలో(Telangana Assembly) హరీశ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క గ్రామమైనా అభివృద్ధి చెందిందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. గ్రామాభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు
భట్టికి ఇప్పుడున్న ఆందోళన, భయం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు 10శాతం ఉన్నా బాగుండేదంటూ హరీశ్ ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై స్టే తెచ్చాము- పనులు ఆపించామని అసెంబ్లీలో(Telangana Assembly) పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి 93 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశామని హరీష్ పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 7,750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని హరీష్ అన్నారు. కానీ ఇవాళ 17,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి హరీష్ రావు వివరించారు. విద్యుత్, మంచినీటి సమస్యలను పరిష్కరించామన్నారు. సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ప్రాజెక్టులను నిర్మించుకొన్న విషయాన్ని మంత్రి అసెంబ్లీలో(Telangana Assembly) ప్రస్తావించారు.
సొంతడబ్బా కొట్టుకోవడం లేదు..
తెలంగాణ అభివృద్ధిపై తాము సొంతడబ్బా కొట్టుకోవడం లేదని.. తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రం ఇచ్చిన లెక్కలే చెప్తున్నామని హరీశ్ అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడితే కనీసం బేసిస్ లేదని పేర్కొన్నారు. గాంధీ (gandhi) పేరు చెప్పుకొని 50 ఏళ్ళు దేశాన్ని పాలించారంటూ హరీష్ రావు.. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలో మార్పులపై భట్టి నియోజకవర్గం మధిరకు వెళ్దామంటూ హరీష్ రావు సవాల్ చేశారు.
69 లక్షల మందికి లబ్ది..
రైతు బంధు పథకం కింద 69 లక్షల మందికి లబ్ది చేకూర్చిన ప్రభుత్వం తమదన్నారు. రైతు బిడ్డగా కేసీఆర్ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేశారని హరీశ్ అన్నారు.. కేంద్రం కూడా ఇదే తరహలో పథకాన్ని అమలు చేస్దుందని హరీష్ రావు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపుగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందించామనే విషయమై వివరాలతో బుక్‌లెట్ ను కూడా అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister harishrao, Telangana Assembly, Telangana Budget 2022, Telangana jobs, TS Congress