గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. కోర్టు కేసుల సంగతి ఎలా.. విమర్శలను లైట్ తీసుకుంటూ.. పరిపాలనా రాజధానిపై ఏపీ సర్కార్ ప్రత్యేక ఫోకస్ చేసింది. ఇప్పటికే అందాల నగరంగా గుర్తింపు తెచ్చుకున్న విశాఖకు మరిన్ని కొత్త హంగులు దిద్దేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 13 మండలాల వీలీనంతో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెరిగింది. ఇప్పుడు పరిపాలనా రాజధానికి కొత్త హంగులు సమకూరబోతున్నాయి.
విశాఖ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచటంతో పాటు…వైజాగ్ సిటీ అభివృద్ధికి సిద్ధమైంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.. విశాఖ మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. పెరిగిన పరిధికి తగ్గట్లు మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేసుకుంటోంది వి.ఎం.ఆర్.డి.ఎ జాతీయ రహదారి నుంచి బీచ్ రోడ్డుకి వీలైనన్ని విశాలమైన రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ముఖ్యంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదన ఉండాలని సూచించారు. అంటే మొత్తం 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొత్తం 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేయనున్నారు. అలాగే 60.2 కిలోమీటర్ల మేర ట్రాం కారిడార్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీటర్ల కారిడార్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు 14 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.
విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,167 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. భీమిలీ -భోగాపురం రహదారి దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని సీఎం అధికారులకు సూచించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు
అవకాశమున్న చోట్ల కొత్త రోడ్లతో పాటు ఉన్న రహదారుల విస్తరణకు సిద్ధమవుతోంది విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. వారం పదిరోజుల్లో పనులు మొదలవుతాయన్నారు వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విస్తరణకు వీలుగా ఉడా స్థానంలో వీఎంఆర్డీఏని ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను మెట్రో రీజియన్‌లోకి చేర్చింది. ఏజెన్సీ మినహా మిగిలిన 431 గ్రామాలను వీఎంఆర్డీఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
కొత్త గ్రామాల విలీనానికి తోడు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి భోగాపురం వరకు 76 కిలోమీటర్ల నిడివి, 53 స్టేషన్లతో మెట్రో నిర్మించాలని సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ సూచించిన 24 గంటల్లోనే వీఎంఆర్డీఏ రంగంలోకి దిగింది. విశాఖలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారయంత్రాంగం అభివృద్ధిపనులు చేపట్టబోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Visakha, Visakhapatnam, Vizag, Ys jagan