హోమ్ /వార్తలు /national /

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదం.. సభ్యత్వమే లేదు సస్పెన్షన్ ఏమిటని నిలదీసిన మాజీ ఎంపీ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వివాదం.. సభ్యత్వమే లేదు సస్పెన్షన్ ఏమిటని నిలదీసిన మాజీ ఎంపీ

మీడియాతో మాట్లాడుతున్న రమేష్ రాథోడ్

మీడియాతో మాట్లాడుతున్న రమేష్ రాథోడ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపిగా పని చేసిన అనుభవం ఆయనది.

  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆయన. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపిగా పని చేసిన అనుభవం ఆయనది. గతకొంత కాలంగా రాజకీయ కార్యక్రమాలతో అంటిముట్టనట్టు ఉంటున్న ఆ నేత ఇపుడు ప్రధాన చర్చలోకి వచ్చారు. ఇంతకి ఆ నాయకుడు ఎవరు, ఎందుకు చర్చనీయాంశంగా మారాడు తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ వార్త చదవండి. ఆదిలాబాద్ మాజి ఎంపీ రమేష్ రాథోడ్ తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. తెలంగాణా రాష్ట ఆవిర్భావం తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్ పార్టీ‌లో చేరారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు. వరుస ఓటములను చవిచూసిన ఆయన కొంతకాలంగా సైలెన్స్‌గా ఉన్నారు.

  ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారని, బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం రమేష్ రాథోడ్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై ఉట్నూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రమేశ్ రాథోడ్.. దానిని ఖండించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. తాను ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, నేతల గురించి కానీ తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. కనీసం ఓడిపోయిన తర్వాత ఏ నేత కూడా సమీక్ష జరపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థి టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలికితే కనీసం మందలించిన వారు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసలు తనకు సభ్యత్వమే లేదని, షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. ఇటీవలే తాను వివేకానంద, శివాజీ జయంతి వేడుకల్లో, జాతీ పండుగ వేడుకల్లో పాల్గొనందుకు సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి దారిన వారు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తన ఆత్మాభిమానాన్ని, ప్రజలతో ఉన్న సత్సంబంధాన్ని తాను ఎప్పుడు పోగొట్టుకోనని ప్రజల కోసమే తాను పనిచేస్తానని, ప్రజలు ఏదంటే అదే చేస్తానని, ఇలాంటి క్రమశిక్షణ లేని కాంగ్రెస్ పార్టీలో తానే ఉండబోనని ఇక కాంగ్రెస్ పార్టీకి సలాం అని పేర్కోన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Adilabad, Telangana, TS Congress

  ఉత్తమ కథలు