హోమ్ /వార్తలు /national /

GHMC Elections: జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10,000 సాయం నిలిపివేత

GHMC Elections: జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10,000 సాయం నిలిపివేత

వరద సాయం కోసం బాదితుల క్యూ (credit - twitter)

వరద సాయం కోసం బాదితుల క్యూ (credit - twitter)

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు అందించే రూ.10,000 సాయానికి బ్రేక్ పడింది.

  గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు అందించే రూ.10,000 సాయానికి బ్రేక్ పడింది. వెంటనే దీనికి సంబందించిన దరఖాస్తుల స్వీకరణ, సాయం నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రేటర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున వెంటనే దీన్ని నిలిపవేయాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ యధావిధిగా కొనసాగించవచ్చని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్టోబర్‌లో వచ్చిన వరదలు భారీ ఎత్తున నష్టాలను మిగిల్చాయి. ఈ క్రమంలో వరద బాధితులకు ఒక్కో ఇంటికి రూ.10,000 చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

  మూడు రోజుల క్రితం వరకు వరద బాధితులకు సాయాన్ని వ్యక్తిగతంగా కలసి అందజేశారు. అయితే, అందులో టీఆర్ఎస్ నేతల చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తమకు అనుకూలంగా వారికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, కాలనీ, బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే.. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమ చేస్తారు. మంత్రి కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత మీ సేవా సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున వరద బాధితులు మీ సేవా కేంద్రాలకు క్యూ కట్టారు. ఉదయం 6 గంటల నుంచే మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు క్యూలో నిలబడిన సమయంలో ప్రాణాలు కోల్పోయింది.

  బీజేపీ వల్లే వరద సాయం ఆగిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ బీజేపీ లేఖ రాసినందు వల్లే ఎన్నికల కమిషన్ వరద సాయం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. తాను ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తన పేరుతో ఫేక్ లెటర్ ప్రచారం అవుతోందన్నారు. తాను లేఖ రాయలేదని హైదరాబాద్ చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ప్రమాణం చేస్తానని, కేసీఆర్ నిజమైన హిందువు అయితే, తనతో పాటు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

  GHMC Election Schedule

  నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 18

  నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేదీ: నవంబర్ 20నామినేషన్ల పరిశీలన: నవంబర్ 21

  నామినేషన్ల విత్ డ్రా: నవంబర్ 22, సాయంత్రం 3 గంటల వరకు

  తుది జాబితా ప్రకటన: నవంబర్ 22 సాయంత్రంఎన్నికల తేదీ: డిసెంబర్ 1 ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..

  రీ పొలింగ్(అవసరమైన చోట మాత్రమే): డిసెంబర్ 3

  కౌంటింగ్: డిసెంబర్ 4 ఉదయం 7 గంటల నుంచి

  ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రస్తుతానికి దరఖాస్తులు కూడా స్వీకరించడానికి వీల్లేదు. అయితే, ఇప్పటి వరకు తీసుకున్న వారికి సాయం అందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

  అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని శాఖల వారీగా అంచనా వేసింది. పంట నష్టం రూ.8,633 కోట్లు, రహదారులకు రూ. 222 కోట్లు, జీహెచ్‌ఎంసీకి రూ.567 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనాల్లో పేర్కొంది. కానీ, కేంద్రం నుంచి వరద సాయం కోసం ఎలాంటి నిధులు రాలేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కో ఇంటికి రూ.10000 చొప్పున సాయం చేస్తామని ప్రకటించింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Hyderabad - GHMC Elections 2020, Hyderabad Floods, Telangana

  ఉత్తమ కథలు