హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll Results: 2014 తర్వాత టీఆర్ఎస్ కు తొలి షాక్.. అది కూడా సీఎం సొంత జిల్లాలో..

Dubbaka ByPoll Results: 2014 తర్వాత టీఆర్ఎస్ కు తొలి షాక్.. అది కూడా సీఎం సొంత జిల్లాలో..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. అయితే సీఎం కేసీఆర్, ఎన్నికల స్పెషలిస్ట్ గా పేరొందిన మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు.

ఇంకా చదవండి ...

  హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. అయితే సీఎం కేసీఆర్, ఎన్నికల స్పెషలిస్ట్ గా పేరొందిన మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో టీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. అనేక ఉప ఎన్నికల్లో రికార్డు సృష్టించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉంది. 2014 సాధారణ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన ప్రతీ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ సంచలన విజయాలు నమోదు చేసింది. 2014లో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా ఒకే సారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మెదక్ ఎంపీ స్థానానికి మొదటి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి 3, 61, 286 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై ఘన విజయం సాధించారు.

  అనంతరం వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2015లో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పసునూరి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4, 59, 088 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. దీంతో ఆ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బలం చేకూర్చాయి. 2016లో నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్టారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నికల వచ్చింది. అభ్యర్థి చనిపోతే ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని కాదని ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలోకి దిగింది.

  ఈ ఎన్నికల బాధ్యతను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు భుజాలకు ఎత్తుకున్నారు. ఊరూరా తిరిగి, సెంటిమెంట్ కు ఎదురెళ్లి టీఆర్ఎస్ కు భారీ విజయాన్ని అందించారు. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి 53, 451ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అదే ఏడాదిలో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో పార్టీని మంత్రి కేటీఆర్ ముందుండి నడిపించారు. ఆ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు 45, 676 ఓట్లు మెజార్టీతో రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి రాంరెడ్డి సుచరితారెడ్డిపై విజయం సాధించారు.

  నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందిన అనంతరం ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో 2019లో హుజూర్ నగర్ కు ఉప ఎన్నికలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె తీవ్రంగా సాగుతున్న ఆసమయంలో టీఆర్ఎస్ పార్టీ ఓడుపోతుందన్న ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ప్రచారాన్ని నిర్వహించింది. అయితే ఆ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ చోట ఘన విజయాలు సాధించిన టీఆర్ఎస్.. తాజా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Dubbaka By Elections 2020, Harish Rao, KTR, Telangana bjp

  ఉత్తమ కథలు