హోమ్ /వార్తలు /national /

Dubbaka By-Elections: దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత?

Dubbaka By-Elections: దుబ్బాకలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత?

చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Dubbaka By-Elections: ఉపఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి. టీఆర్ఎస్ కీలక నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి సొంత గూటికి చేరుకోనున్నారు. ఈ రోజే ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి. టీఆర్ఎస్ లో తనకు ఇక టికెట్ రాదన్న విషయం నిర్ధారించుకున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజే ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ లభించినట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. ముత్యంరెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని కేసీఆర్ ఆ సమయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే ఎన్నికల అనంతరం ముత్యం రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి పెద్దగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరం పెడుతున్నారని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది.

  అయితే ఇటీవల ఎమ్మెల్యే సోలిపేట మరణం అనంతరం శ్రీనివాస్ రెడ్డి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ తన తండ్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని.. ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని అనేక సార్లు ఆయన ప్రకటించారు. కానీ టీఆర్ఎస్ అధిష్ఠానం మాత్రం సోలిపేట సతీమణి సుజాతకు టికెట్ ఇచ్చేందుకు మొగ్గుచూపింది. శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని టీఆర్ఎస్ ముఖ్య నేతల ద్వారా హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ తనకు ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడూ ఇక పోటీ చేసే అవకాశం రాదని భావించిన శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

  ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో శ్రీనివాస్ రెడ్డి మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. టికెట్ ఇస్తే తాను కాంగ్రెస్ లోకి వస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ రోజు ఉదయం వరకు సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే ఆయన స్థానికేతరుడు కావడంతో ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దుబ్బాకలో స్థానికంగా పట్టు ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి టికెట్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

  కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా?

  దుబ్బాక ఎన్నికల విషయంలో మిగతా పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ అంతగా యాక్టీవ్ గా లేదన్న ప్రచారం సాగింది. అభ్యర్థి విషయంలోనూ ఆ పార్టీ నేతల్లో క్లారిటీ లేదన్న అభిప్రాయమూ రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా దుబ్బాక విషయంలో కాంగ్రెస్ స్పీడు పెంచింది. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో నర్సారెడ్డిని దుబ్బాక అభ్యర్థిగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చెరుకు శ్రీనివాస్ రెడ్డిని త్వరగా పార్టీలోకి తీసుకువచ్చేందుకే నిన్న వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నర్సారెడ్డి పేరును తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తే తనకు ఇక అవకాశముండదని భావించిన శ్రీనివాస్ రెడ్డి వెంటనే కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని సమాచారం. శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా తమకు బలమైన అభ్యర్థి దొరకడంతో పాటు, టీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బకొట్టాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana Politics

  ఉత్తమ కథలు