హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాకలో ముగిసిన ప్రచారం, 3న ఎన్నికలు, అమల్లోకి 144 సెక్షన్

Dubbaka ByPolls: దుబ్బాకలో ముగిసిన ప్రచారం, 3న ఎన్నికలు, అమల్లోకి 144 సెక్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నవంబర్ 1వ తేది సాయంత్రం 6 గంటల నుంచి దుబ్బాక నియోజక వర్గంలో 144 సెక్షను అమలులో వచ్చింది. ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు తిరిగి వెళ్ళిపోవాలని అధికారులు తెలిపారు.

  దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. దుబ్బాక బై ఎలక్షన్లలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. మరో ఐదు మంది అభ్యర్థులు చిన్న పార్టీల బీ ఫామ్ తెచ్చుకొని బరిలో నిలిచారు. మిగతా 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. మొత్తం పోలింగ్ బూత్‌లు 315. అందులో సమస్యాత్మకమైన బూత్‌లు 23 గా గుర్తించారు. అక్కడ ఒకటికి రెండింతలు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

  స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. దుబ్బాక ఎంసీఎంసీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 3 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.58 లక్షలు సీజ్ చేశామన్నారు. రూ.2 లక్షలకు సరైన ఆధారాలు కలిగి ఉండడంతో సదరు వ్యక్తులకు ఆ నగదును అందజేశామని తెలిపారు. ఓటర్ స్లిప్పులు గుర్తింపుగా ప్రామాణికం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య సూచించారు.

  దుబ్బాక నియోజకవర్గంలో 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 97,978 మంది పురుషులు. 1,00,778 మంది మహిళలు. 51మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 89 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామని చెన్నయ్య పేర్కొన్నారు. 400 మంది పీఓలు, 400 మంది ఏపీఓలు, 800 మంది అదనపు పోలింగ్ అధికారులను నియమించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6,150 మంది వృద్ధులు ఉన్నారని, వీరిలో 80 సంవత్సరాల పైబడి ఉన్న 1550 మంది వృద్ధులలో 1340 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అంధులైన ఓటర్లకు 315 పోలింగ్ కేంద్రాలకు బ్రెయిలీ లిపితో కూడిన బ్యాలెట్ పత్రాలను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు.

  కోవిడ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్న 130 మందికి 93 మంది తమకు దరఖాస్తులు ఇవ్వగా 73 మంది అర్హులను గుర్తించామని చెన్నయ్య తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కోవిడ్ బాధితులకు పోలింగ్ సమయం ముగిసే ఆఖరి గంటకు ముందు అనుమతిస్తామని చెప్పారు. 104 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ 98 కేంద్రాల్లో వీడియోగ్రాఫర్స్ 113 కేంద్రాల్లో అన్ మ్యాన్డ్ కెమెరాలు 80 మంది సూక్ష్మ పరిశీలకులు, 32 రూట్లలో 32 మంది సెక్టార్ ఆఫీసర్లు, 32 మంది అసిస్టెంట్ సెక్టార్ ఆఫీసర్లు 5,000 మంది రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తో కలిసి పకడ్బందీగా దుబ్బాక ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు తిరిగి వెళ్ళిపోవాలని అన్నారు. నవంబర్ 1వ తేది సాయంత్రం 6 గంటల నుంచి దుబ్బాక నియోజక వర్గంలో 144 సెక్షను అమలులో వచ్చింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Election Commission of India, Telangana

  ఉత్తమ కథలు