హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత నామినేషన్

Dubbaka ByPolls: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత నామినేషన్

దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సుజాత

దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సుజాత

దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఇవాళ నామినేషన్ దాఖలు చేసారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.

  దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనతో హోరెత్తిస్తున్నారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. అయితే..దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఇవాళ నామినేషన్ దాఖలు చేసారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా...17 న పరిశీలన, 19 వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో సుజాత అభ్యర్థిత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ధికి నిరోధకులుగా మారారని, అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. హుజూర్ నగరంలో వచ్చిన ఫలితాలే దుబ్బాకలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. నిజామాబాద్ లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు రాలేదని, దుబ్బాకలో కూడా అదే రిపీట్ అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తోందని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాబోయే రోజుల్లో దుబ్బాకను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

  మరోవైపు ఎలాంటి ఆధారాలూ లేకుండా తీసుకుని వెళుతున్న రూ. 7.50 లక్షలను సిద్దిపేట పోలీసులు సీజ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ హై స్కూల్ వద్ద సిద్దిపేట ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ఆంజనేయులు, ట్రాఫిక్ సిబ్బందితో కలిపి వాహనాలు తనిఖీ చేస్తుండగా పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ.. తండ్రి శ్రీనివాస్ తన వాహనంలో ఉన్న బ్యాగులో 7 లక్షల 50 వేల రూపాయలు తీసుకెళ్తున్నారు. అయితే ఈ నగదుకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో ఈ సొమ్మును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ నగదును వన్ టౌన్ సీఐ సైదులు పంచనామా చేసి జిల్లా ఎన్నికల కార్యాలయం కలెక్టర్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశారు. నగదు తీసుకెళ్తున్న సదరు వ్యక్తి డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి వాటిని తీసుకెళ్లవచ్చునని పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద 50 వేల రూపాయలకు మించి డబ్బులు తీసుకెళ్లవొద్దనీ, అంతకంటే ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు చూపించకుంటే వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీలు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చేసుకోవాలని సూచించారు.

  దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Harish Rao, Telangana

  ఉత్తమ కథలు