హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll Results: దుబ్బాకలో భారీగా బెట్టింగ్‌లు, ఈ రెండు పార్టీల మీద పోటాపోటీగా

Dubbaka ByPoll Results: దుబ్బాకలో భారీగా బెట్టింగ్‌లు, ఈ రెండు పార్టీల మీద పోటాపోటీగా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులు ఉండటంతో దుబ్బాక నియోజక వర్గంలో భారీగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది.

  (వీరేష్, మెదక్ కరస్పాండెంట్, న్యూస్‌18తెలుగు)

  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులు ఉండటంతో దుబ్బాక నియోజక వర్గంలో భారీగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య బెట్టింగ్లు నడుస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగులు కడుతున్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులు ఉండటంతో ఎవరికి వారే తమ పార్టీ నేత గెలుస్తారని అంచనా వేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టెన్షన్ మొదలైంది. ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 20 రౌండ్ లు 23 టేబుల్స్ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్లికేరి తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలలో 82.62 పోలింగ్ శాతం నమోదయింది.

  దుబ్బాక నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో అధికార పార్టీ నుంచి రామలింగా రెడ్డి సతీమణి సుజాత, ప్రతిపక్ష పార్టీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ,కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కత్తి కార్తీక, మరో నలుగురు చిన్న పార్టీల నుంచి బీఫామ్ తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

  మరోవైపు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కమిషనర్ జోయల్ డేవిస్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు.

  1. ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దు.

  2. కౌంటింగ్ కేంద్రం నుంచి 1 కిలోమీటర్ వరకు పార్టీ జెండాలు, పార్టీ గుర్తులు, ప్లే కార్డ్స్ ధరించవద్దు ప్రదర్శించవద్దు.

  3. మైకులు, లౌడ్ స్పీకర్లు, వాడరాదు, టెంట్లు, షామియానాలు వేయకూడదు, ఉపన్యాసాలు ఇవ్వకూడదు.

  4. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటివి నిర్వహించడం, నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

  5. గెలుపొందిన పార్టీ నాయకులు ర్యాలీలు, సభలు సమావేశాలు నిర్వహించకూడదు.

  6. ఎన్నికల కౌంటింగ్ కు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడానికి సహకరించాలని సూచించారు.

  10-11-2020 ఉదయం 6:00 నుంచి 11-11-2020 ఉదయం 6:00 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఉత్తర్వులు జారీ చేశారు.

  ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

  దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ గెలుస్తుందని ఓ సంస్థ చెప్పగా... మరో సంస్థ బీజేపీ గెలుపు సాధిస్తుందని అంచనా వేసింది. ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేసింది. పోలైన ఓట్లలో టీఆర్ఎస్‌కు 48.72 శాతం వస్తాయని పేర్కొంది. బీజేపీకి 44.64 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 6.12 శాతం ఓట్లు, ఇతరులకు 2.52 శాతం వస్తాయని విశ్లేషించింది. అయితే తమ సర్వేలో అంచనాల్లో వచ్చిన ఫలితాలకు మూడు శాతం ఓట్లు అటు ఇటు రావొచ్చని పేర్కొంది. సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉంటుండటంతో.. ఫలితం ఎలాగైనా ఉండే అవకాశం ఉంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు