హోమ్ /వార్తలు /national /

Dubbaka ByPoll: దుబ్బాక ఫలితాలు ఆ ముగ్గురు నేతలకు అత్యంత కీలకం.. తేడా వస్తే పదవికే ప్రమాదం..

Dubbaka ByPoll: దుబ్బాక ఫలితాలు ఆ ముగ్గురు నేతలకు అత్యంత కీలకం.. తేడా వస్తే పదవికే ప్రమాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు సవాల్ గా మారాయి.

  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీల్లోని ముగ్గురు నాయకులకు సైతం ఈ ఎన్నిక సవాల్ గా మారింది. టీఆర్ఎస్ ప్రచారాన్ని మొత్తం అదే జిల్లాకు చెందిన మంత్రి హరీశ్ రావు అన్నీ తానై నడిపించారు. హరీశ్ రావు మినహా.. ఇతర మంత్రులు, కీలక నెతలెవరూ టీఆర్ఎస్ ప్రచారంలో పాలు పంచుకోలేదు. గతంలో అనేక కీలక ఉప ఎన్నికల్లోనూ పార్టీకి భారీ విజయాలను అందించిన హరీశ్ రావు ఈ సారి ఆ రికార్డును తిరగరాస్తారా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ కు 60 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. అయితే ఈ సారి అంతకన్నా ఎక్కువగా మెజారిటీ సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే మెజారిటీ తగ్గితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న ప్రచారం సాగే అవకాశం ఉంది. మెజారిటీ బాగా తగ్గితే అ ప్రచారం ఇంకా అధికంగా సాగే అవకాశం ఉంది.

  ఒక వేళ కొన్ని సర్వేల్లో వచ్చినట్లు టీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి 2014 తర్వాత తగిలిన పెద్ద దెబ్బగా ఈ ఎన్నికల ఫలితం మారుతుంది. ఇదే జరిగితే హరీశ్ రావు కు పార్టీలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కు సైతం ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన అనేక వేధికలపై చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇదే ప్రచారంతో దూకుడుగా వెళ్లింది.

  ఒక వేళ ఆ పార్టీ ఓడిపోతే శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్ కు వలసలు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దుబ్బాకలో బీజేపీ ఓడిపోయినా.. ఓట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇది జరిగి.. కొద్ది మెజార్టీతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచినా బీజేపీ దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని.. తామేనని చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక వేళ ఆ పార్టీ మూడో స్థానంలోకి వెళ్తే మాత్రం పార్టీకి, ముఖ్యంగా నూతనంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కు ఆ పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

  ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కు సైతం ఈ ఎన్నిక కీలకం కానుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ వరుస అపజయాలను మూటగట్టుకుంది. ఇటీవల ఆయన రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానంలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఆయనకు ఇబ్బందిగా మారింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నామ మాత్రంగా ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఒక వేళ అనేక సర్వేల్లో చెప్పినట్లు దుబ్బాకలో బీజేపీ రెండో స్థానంలో నిలిచి, కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్తే ఆ పార్టీకి, ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కు ఈ పరిస్థితి మరీ ఇబ్బందిగా మారనుంది. ఆ పార్టీ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ లోకి వలసలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఆయన తన నాయకత్వంపై మరో సారి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కోకతప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  ఇది ఇలా ఉంటే.. రేపు జరగనున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 14 టేబుల్స్ పై 23 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందు కోసం కలెక్టర్ భారతీ హోళికేరి ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటల వరకే కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రయలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ నుంచి ఎన్నికల అధికారులు కలెక్టర్ భారతీ హోళికేరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పట్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bandi sanjay, Dubbaka By Elections 2020, Harish Rao, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు