కొందరు ప్రజాప్రతినిధులు తమ నోటి మాటతో ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. తాము ఎలా మాట్లాడినా చెలామణి అవుతుందన్న ధోరణితో ఇష్టానుసారంగా కామెంట్ చేస్తూ కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈజాబితాలో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా చేరిపోయి వివాదాల్ని మూటగట్టుకుంటున్నారు. లేటెస్ట్గా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా కాంట్రవర్సీ కామెంట్ చేసి విమర్శల పాలయ్యారు. నిత్యం శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తూ ..తమ జీవితాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహించే పోలీసులను చులకన చేసి మాట్లాడారు. అయితే ఇదంతా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో భాగంగానే పోలీసులను కించపరిచారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. సుల్తాన్పూర్ లోధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్దూ తమ పార్టీ ఎమ్మెల్యేలు తలుచుకుంటే పోలీసులకు ప్యాంట్లు తడిసిపోయేలా చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ చేసిన ఆ వ్యాఖ్యలనే అటు బీజేపీ, ఇటు శిరోమణి అకాలీదళ్ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. ఒక సీనియర్ పొలిటిషియన్ వాడే భాష ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరమన్నారు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్. శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్‌సింగ్ సైతం సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సింగ్జీ ఏ క్యా హై..
పోలీసులను అవమానపరుస్తూ సిద్దూ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికే తెగ వైరల్ అయింది. దీనిపై పోలీసులు కూడా అంతే ఘాటుగా స్పందించారు. సిద్దూ కుటుంబానికి సెక్యురిటీ ఇస్తోంది కూడా మా పోలీసులే అంటూ చంఢీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ కౌంటర్ ఇచ్చారు. అంతే కాదు ఆయనకు పరువునష్టం నోటీసులు పంపామన్నారు.
వదలని వివాదాలు..
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా రెండ్రోజుల క్రితం మహిళలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం సృష్టించాయి. ఇది చల్లారక ముందే మళ్లీ సిద్ధూ పోలీసులపై నోరు పారేసుకోవడం కొత్త వివాదానికి తెర తీసినట్లైంది. తన కామెంట్‌పై విపక్ష పార్టీల నుంచి వస్తున్న రియాక్షన్స్‌ను నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎలా రిసీవ్ చేసుకుంటారు..వాటికి ఎలా బదులిస్తారో చూడాలి.
వచ్చే ఎన్నికల్లో పంజాబ్‌లో పాగా వేయడానికి బీజేపీ పొత్తులతో సిద్ధమవుతోంది. ఎలాగైనా కాంగ్రెస్‌ని చిత్తు చేయాలని ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఇలా నోరు జారడంతో దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి మిగిలిన రాజకీయ పార్టీలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress chief, Navjot Singh Sidhu, Punjab