తెలంగాణ సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్‌లో చక్రం తిప్పనున్నారా ? టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు మళ్లీ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత పెరుగుతోందా ? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. మహాకూటమిలో పార్టీల మధ్య సమన్వయం చేయడంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు సరిగ్గా వ్యవహరించడం లేదనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈ కారణంగానే డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పక్కనపెట్టడంతో డీఎస్ ప్రస్తుతం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీతో సమావేశమైన డీఎస్... కాంగ్రెస్ పార్టీలో చేరారని వార్తలు వినిపించాయి. అయితే తాను కాంగ్రెస్‌లో చేరలేదని డీఎస్ వివరణ ఇచ్చారు. అయితే డీఎస్ అనుభవాలను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
2004, 2009లో డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధించింది. అప్పట్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన క్రెడిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అయినా... 2004లో టీఆర్ఎస్‌తో పొత్తు అంశాన్ని డీల్ చేయడంలో డీఎస్ సమర్థవంతంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో అసంతృప్తులను డీల్ చేయడంలోనూ ఆయన తీరు బాగుంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ సారి తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు మహాకూటమి భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం... ఈ బాధ్యతలను డీఎస్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. కూటమి పక్షాలతో డీఎస్ త్వరలోనే చర్చలు జరపబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, D Srinivas, Mahakutami, Sonia Gandhi, Telangana, Telangana Election 2018, Trs