ఏపీలో రాజధాని రగడ రోజురోజుకు పతాకస్థాయికి చేరుకుంటోంది. రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా కొన్ని పార్టీలు రంగంలోకి దిగి నిరసనలు కూడా చేపడుతున్నాయి. బీజేపీ వంటి పార్టీలు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై తమ వైఖరి చెప్పకపోయినా... ఆ పార్టీ నేతలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ఈ వ్యవహారంలో ముందుకు సాగుతున్నారు. ఆ రకంగా రాజధాని రగడ వ్యవహారంలో బీజేపీ వాయిస్ కూడా వినిపిస్తోంది. జనసేన, సీపీఐ కూడా రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి మరో లెఫ్ట్ పార్టీ సీపీఎం దూరంగా ఉండటం గమనార్హం.
సాధారణంగా అనేక అంశాలపై వామపక్షాలైన సీపీఎం, సీపీఐ కలిసి పోరాటం చేస్తుంటాయి. విధానాల విషయంలో కొన్ని భేదాలు ఉన్నప్పటికీ... చాలా అంశాల్లో రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతుంటాయి. కానీ రాజధాని రగడ విషయంలో సీపీఐ నేరుగా రంగంలోకి దిగి ఆందోళనలు చేపడుతుంటే... సీపీఎం మాత్రం ఈ నిరసనలకు దూరంగా ఉంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
అయితే త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులోనూ వైసీపీతో కలిసి సీపీఎం ముందుకు సాగే అవకాశం ఉందని... ఈ కారణంగానే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీపీఎం ఆందోళనలు చేపట్టడం లేదేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సీపీఎంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నారని... అందుకే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు శస్తచికత్స చేయించుకుంటే ఇంటికెళ్లి పరామర్శించారని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి రాజధాని రగడ విషయంలో అమరావతి రైతులకు సీపీఐ బాసటగా నిలుస్తుంటే... సీపీఎం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Ap cm ys jagan mohan reddy, CPM