ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనేంత స్థాయిలో భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) పార్టీలో సంచలన సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడ్ల్యూసీ) మొదలుకొని పీసీసీ, డీసీసీ, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల దాకా అన్నింటా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ, పీసీసీల్లో 50 శాతం బీసీ, ఎస్సీలే ఉండేలా పార్టీ రాజ్యాంగాన్ని సవరించనున్నారు. అదే సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుల చేతికి మరిన్ని అధికారాలు అప్పగించనున్నారు. 136 ఏళ్ల పార్టీ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ నిర్ణయాలను సోమవారం నాటి సీడబ్ల్యూసీ భేటీలోనే ఖరారు చేయనున్నారు. అంతేకాదు,
2014 నుంచి వరుస ఓటముల నేపథ్యంలో తొలిసారి అంతర్గత మేథోమథనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈనెల 13 నుంచి 15 వరకు ఉదయ్‌పూర్(రాజస్థాన్) వేదికగా జరుగనున్న చింతన్ శిబిర్ (Chintan Shivir) అజెండాను కూడా ఇవాళ్టి సీడబ్ల్యూసీ భేటీలోనే ఖరారు చేయనున్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీని అంతర్గతంగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. సంస్థాగత సంస్కరణలకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. ఈనెల 13 నుంచి జరిగే చింతన్ శిబిర్ లో వీటిపై విస్తృతంగా చర్చించి, పార్టీ రాజ్యాంగాన్ని సవరించనున్నారు. పూర్తి వివరాలివే..
కాంగ్రెస్ అధిష్టానం నేడు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో.. ఈనెల 13 నుంచి ఉదయపూర్‌లోని నిర్వహించనున్న చింతన్ శివిర్ ఎజెండాను ఖరారు చేస్తారు. అలాగే పార్టీలో అంతర్గత సంస్కరణలకూ పచ్చ జెండా ఊపనున్నారు. సంచలన సంస్కరణల్లో భాగంగా.. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచాలని, అన్ని స్థాయిల కమిటీల్లో 50 శాతం ఆ వర్గాల వారే ఉండేలా పార్టీ రాజ్యాంగాన్ని సవరించనున్నారు. ఇప్పటి దాకా కాంగ్రెస్ కమిటీలో బీసీ, ఎస్సీలకు 20 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండగా, ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచనున్నారు.
ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచాలనే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్ శిబిర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్ శిబిర్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు.
సంస్కరణల్లో భాగంగా ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ఏఐసీసీలో ఇప్పుడున్నట్లు 100 మంది కార్యదర్శులు కాకుండా 30 మందికి తగ్గించనున్నారు. అలాగే పీసీసీలకు మరిన్ని బాధ్యతలు అప్పగించనున్నారు. జిల్లాల కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే విధానానికి స్వస్తి పలుకుతూ ఇకపై పీసీసీ నాయకత్వమే డీసీసీలను నియమించుకునేలా సంస్కరణలు తేనున్నారు. తద్వారా పీసీసీ అధ్యక్షుల బాధ్యతలు పెరగనున్నాయి. కాగా,
ఈ నెల 13 నుంచి 15 వరకు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా జరుగనున్న చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ చర్చించబోయే అంశాలు.. ప్రశాంత్ కిషోర్ సూచించినవేనా? లేక సొంతగా రూపొందించుకున్నవా? అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఇటీవల విశ్వ ప్రయత్నం చేసిన పీకే.. పార్టీ పునరుద్ధానానికి ఏకంగా 600 స్లైడ్లతో భారీ వ్యూహాలను ప్రజెంట్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ చేపట్టబోయే సంస్థాగత మార్పుల్లో పీకే సూచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాను ఆశించిన హోదా దక్కకపోవడంతో పీకే కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించి, సొంతగా పార్టీ పెట్టేందుకు సమాయత్తం కావడం, ఆ మేరకు బీహార్ లో అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనుండటం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicc, Congress, CWC, Prashant kishor, Rahul Gandhi, Sonia Gandhi