POLITICS CONGRESS PRESIDENT SONIA GANDHI INTERESTING COMMENTS ON STRENGTHENING PARTY AK
Sonia Gandhi: మంత్రదండం లేదు.. సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు.. సమయం వచ్చిందంటూ..
సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
Sonia Gandhi: నవసంకల్ప చింతన్ శివిర్‌లో దాదాపు 400 మంది పాల్గొంటున్నారని, వీరిలో ఎక్కువ మంది సంస్థలో ఏదో ఒక హోదాలో ఉన్నవారు లేదా సంస్థ లేదా ప్రభుత్వంలో పదవులు పొందినవారేనని సోనియాగాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తిరిగి పునరుత్తేజం నింపేందుకు ఏం చేయాలి ? ఏ రకంగా మళ్లీ దేశ ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవాలనే దానిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించారు. పార్టీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అలాంటి పరిస్థితుల్లో నిస్వార్థంగా, క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) సోమవారం పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రదండం లేదని ఆయన వ్యాఖ్యానించారు.. మే 13-15 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో జరగనున్న నవసంకల్ప చింతన్ శివిర్ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని ఆమె అన్నారు. దానిని ప్రతిబింబించాలని పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన అన్నారు.
పార్టీ పునర్వ్యవస్థీకరణ జరగాలని సోనియగాంధీ అభిప్రాయపడ్డారు. నవసంకల్ప చింతన్ శివిర్‌లో దాదాపు 400 మంది పాల్గొంటున్నారని, వీరిలో ఎక్కువ మంది సంస్థలో ఏదో ఒక హోదాలో ఉన్నవారు లేదా సంస్థ లేదా ప్రభుత్వంలో పదవులు పొందినవారేనని ఆమె అన్నారు. ఈ శిబిరంలో సమతౌల్య ప్రాతినిధ్యం ఉండాలని, సమతూకం ఉండాలని ప్రయత్నించామని తెలిపారు. రాజకీయాలు, సామాజిక న్యాయం, సాధికారత, ఆర్థిక వ్యవస్థ, సంస్థ, రైతులు, వ్యవసాయం, యువత, సాధికారత వంటి అంశాలను 6 గ్రూపులుగా చర్చిస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తమ వద్ద మంత్రదండం లేదని... నిస్వార్థ కృషి, క్రమశిక్షణ, స్థిరమైన సమిష్టి ఉద్దేశ్య స్ఫూర్తితో పట్టుదల, దృఢత్వాన్ని ప్రదర్శించగలమని, పార్టీ మనందరికీ ఎల్లప్పుడూ మేలు చేస్తుందని అన్నారు. ఇప్పుడు రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. త్వరలో జరగబోయే ఈ చింతన్ శివిర్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక అంశాలపై చర్చించబోతోందని.. ఒకరకంగా ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి సంస్కరణల దిశగా కాంగ్రెస్ (Congress) అడుగులు వేస్తుందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
నిజానికి చింతన్ శివిర్ సమావేశం నాటికి ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే.. ఆయన చేసిన ప్రతిపాదనలపైనే ఈ భేటీలో చర్చించేవారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపై ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు ఓ రోడ్ మ్యాప్ ఇచ్చారని.. అందులో తమకు ఇబ్బంది కలిగే అంశాలను పక్కనపెట్టి మిగతా వాటిని అమలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.