హోమ్ /వార్తలు /national /

కాంగ్రెస్ వ్యూహాలు...కోదండరాం పార్టీకి కొత్త మెలిక

కాంగ్రెస్ వ్యూహాలు...కోదండరాం పార్టీకి కొత్త మెలిక

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం (ఫైల్)

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం (ఫైల్)

కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌కు సీట్లు కేటాయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా టీజేఎస్‌కు కాంగ్రెస్ కొత్త మెలిక పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

  మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీతో సీట్ల సర్దుబాటును దాదాపుగా ఖరారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ... టీజేఎస్, సీపీఐ పార్టీలతో సీట్ల పంపకం అంశాన్ని కూడా కొలిక్కి తెచ్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ఇరు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్... కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ విషయంలో కొత్త మెలికలు పెడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీజేఎస్‌కు ఏడు సీట్లు ఇవ్వడానికి అంగీకరించిన కాంగ్రెస్... అందుకు సంబంధించిన జాబితాను కూడా ఆ పార్టీకి ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందుకు టీజేఎస్ అంగీకరించకపోవడంతో... కాంగ్రెస్ పార్టీ కొత్త మెలికను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

  టీజేఎస్ కోరినట్టుగా 11 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరిస్తూనే... ఆ పార్టీ పోటీ చేయబోయే కొన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ చెప్పినట్టు సమాచారం. దీనిపై జనసమితి అభ్యంతరం చెప్పినట్టు టాక్. చర్చలు ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో స్నేహపూర్వక పోటీ అంశం తెరమీదకు రావడంపై ఆసక్తి నెలకొంది. నిజానికి టీజేఎస్‌తో పొత్తుల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేదని భావిస్తున్న కాంగ్రెస్... టీజేఎస్ ఎన్నికల గుర్తు కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదని అంటోంది. అందుకే టీజేఎస్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ గుర్తు మీదే పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కోరింది.

  స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కోదండరాం అంగీకరించలేదు. ఇక ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితమైతే బాగుంటుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనను సైతం ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది.

  తాజాగా టీజేఎస్‌కు సీట్లు ఇస్తూనే కొన్ని సీట్లలో స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విషయం అర్థమవుతోంది. అయితే నామినేషన్ల తేదీ దగ్గర పడుతుండటంతో... టీజేఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది వదిలేసిన సీట్ల విషయంలోనూ ఏదైనా కొత్త మెలిక పెడుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Congress, Jana reddy, Kodandaram, Telangana, Telangana Election 2018, Telangana Jana Samithi, Trs, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు