కాంగ్రెస్‌లో హుజూరాబాద్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య హుజూరాబాద్ పంచాయతీ కొనసాగుతోంది. ఈ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కొందరు ఆరోపిస్తుంటే.. పార్టీ కోసం పని చేయని నేతలు రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. అసలు హుజూరాబాద్‌లో (Huzurabad) కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నివేదిక టీపీసీసీకి వచ్చిందా ? అధిష్టానానికి చేరిందా ? అన్న విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) కూడా సీరియస్ అయ్యింది. మరీ ఇంత దారుణమైన ఫలితం ఎందుకు వచ్చిందనే దానిపై ఆరా తీస్తోంది.
దీనిపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్మూరి వెంకట్‌ను ఈ నెల 13న ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వీరితో ఏం చర్చిస్తుందా ? వీళ్లు అధిష్టానానికి ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటారు ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని.. ఈ కారణంగానే ఈ రకమైన దారుణమైన ఫలితాలు వచ్చాయని కొందరు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంగానే హైకమాండ్ వీరిని ఢిల్లీ రావాలని ఆదేశించిందనే చర్చ కూడా సాగుతోంది. ఈ భేటీలో వివరణ ఇచ్చుకునేందుకు ఈ ముగ్గురు నేతలు నివేదికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో పార్టీ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఎవరికీ లేకపోయినప్పటికీ.. మరీ ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ ఊహించలేకపోయింది. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోవడం.. బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ గెలవడం కూడా కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?
Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..
బీజేపీ బలంగా లేని తెలంగాణలో ఆ పార్టీ బలపడుతుండటం.. బలంగా ఉన్న తాము ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. దీంతో హుజూరాబాద్ ఓటమిపై ఈ ముగ్గురు నేతలు నివేదికలు ఇచ్చిన తరువాత కాంగ్రెస్ హైకమాండ్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ? తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయంలో వాస్తవ పరిస్థితులను హైకమాండ్‌కు తెలియనీయకుండా చేస్తున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.