హోమ్ /వార్తలు /national /

# ఘర్ వాపసి...ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌లో షురూ!

# ఘర్ వాపసి...ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌లో షురూ!

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి (ఫైల్ ఫొటో)

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి (ఫైల్ ఫొటో)

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తమకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందని నేతలు భావిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఘర్ వాపస్’ షురూ అయింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకోనుంది. 2014 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పార్టీని వీడి వెళ్లిన నాయకులను సొంత గూటికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ నేతలతో కాంగ్రెస్ పెద్దలు తెరచాటు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు మాజీలు బలంగా నమ్ముతున్నారు. దీంతో రాజ్యసభ పదవులు, పార్టీలో జాతీయ స్థాయి పదవులపై ఆశతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయనను ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఊమెన్‌ చాందీ కలిశారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించిన ఆయన గురువారం దిల్లీకి చేరుకున్నారు. ఇవాళ(శుక్రవారం) హస్తినలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్న కిరణ్ కుమార్ రెడ్డి...ఆయన సమక్షంలోనే తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఊమెన్‌ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటారు. ఇందు కోసం ఆయన గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. పార్టీలో జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తామని ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డికి ఏదైనా ఓ రాష్ట్రానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి పదవిని కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)

ఢిల్లీ పెద్దలు అటు తెలంగాణలోనూ ‘ఘర్ వాపస్’పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్‌ను తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న డీ.శ్రీనివాస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ కవిత పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను డీఎస్ కలవడం వెనుక ఇదే కారణమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

2014 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి చేరిన మరికొందరు ఏపీ, తెలంగాణ ప్రాంత నేతలను కూడా తిరిగి సొంతింటిగా రప్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గూటికి తిరిగి ఎవరెవరు చేరుతారన్న విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

First published:

Tags: AP Politics, D Srinivas, Kiran kumar Reddy, Telangana News

ఉత్తమ కథలు