2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగనున్నట్టు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను పెద్ద మొత్తంలో ఏకం చేసేందుకు కాంగ్రెస్ అవసరం ఉందన్నారు. ప్రధానంగా బీజేపీని ఓడించాల్సి అవసరం ఉందని.. లేకపోతే ఆ పార్టీ రాజ్యాంగానికి చాలా ప్రమాదకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి ఈ విషయాలు వెల్లడించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం.. కేరళలో ప్రత్యర్థులుగా ఉండటంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. అలాగే బిహార్ ఎన్నికలపై స్పందించారు. ఏచూరితో ఇంటర్వ్యూ ఇలా సాగింది..
న్యూస్ 18: పశ్చిమ బెంగాల్‌లో వ్యుహాత్మకంగా కాంగ్రెస్ కలిసి కూటమిగా ముందుకు వెళ్లడానికి సీపీఎం కేంద్ర కమిటీ తొలిసారిగా ఆమోదం తెలిపింది. గతానికి భిన్నంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
సీతారాం ఏచూరి: ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజ్యాంగాన్ని వివిధ మార్గాల్లో నాశనం చేస్తున్నారు. రాజ్యంగ అధికారాన్ని అణగదొక్కుతున్నారు. ఇది దేశానికి తీవ్ర ప్రమాదం కలగజేస్తుంది. అందువల్ల బీజేపీని ఓడించడం అనేది చాలా ముఖ్యం. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. దీనిని లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా తమవైపు తిప్పుకోవాలని బీజేపీ పావులు కదుపుతుంది. అందుకే యాంటీ బీజేపీ, యాంటీ టీఎంసీ ఓట్లు చీలకుండా ఉండేందుకు మేము కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.
న్యూస్ 18: ఇక, రాష్ట్రంలో మీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమేనా, టీఎంసీ కాదా?
సీతారాం ఏచూరి: మా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ.. కానీ టీఎంసీని ఓడించకుండా బీజేపీని ఓడించలేం. బీజేపీ బెంగాల్‌లో ప్రవేశించడానికి తృణమూల్ ఒక వాహనంగా పనిచేసింది. గతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు కలిసి పనిచేశాంయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అందుకే బీజేపీని ఓడించడానికి.. టీఎంసీని కూడా ఓడించడం చాలా అవసరం.
న్యూస్ 18: పశ్చిమ బెంగల్‌లో కూటమిగా ముందుకు సాగడానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందా?
సీతారాం ఏచూరి: అందుకు వారు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఇందుకోసం యాంటీ బీజేపీ శక్తులన్నీ ఓ చోట చేరాలి. బెంగాల్‌లో యాంటీ టీఎంసీ, యాంటీ బీజేపీ ఓటు బ్యాంక్‌ను ఒక చోట చేర్చాలి.
న్యూస్ 18: చివరిసారిగా జరిగిన ఎన్నికలు ఈ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని మీరు ఎలా అనుకుంటున్నారు?
సీతారాం ఏచూరి: గత ఎన్నికల్లో మేము విడివిడిగా పోటీ చేయడం వల్ల మమతా బెనర్జీ వ్యతిరేక ఓట్లు బీజేపీకి వెళ్లాయి. బై పోలార్ పొలరైజేషన్ జరిగింది. మేము దాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నాం. అది బెంగాల్‌కు, ఇండియాకు చాలా అవసరమైనది.
న్యూస్ 18: పశ్చిమ బెంగాల్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని తృణమూల్ కాంగ్రెస్ చాలా సార్లు, చాలా విధాలుగా ఆరోపించింది.
సీతారాం ఏచూరి: గవర్నర్ రాజకీయ నాయకుడిగా జోక్యం చేసుకోవడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోంది. గవర్నర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి. అయితే దానిని రాజకీయ పదవికి తగ్గించారు. భారతదేశంలో చాలా ప్రంతాల్లో, రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకం.. అందుకే ఆమోదయోగ్యమైనది కాదు.
న్యూస్ 18: ఈ విషయంలో మీరు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతు ఇస్తారా?
సీతారాం ఏచూరి: ఒకవేళ ఆర్టికల్ 356 లాంటివి ఉపయోగించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా ఏదైనా జరిగితే అలాంటి వాటిపై మేము బలంగా పోరాడుతాము. అందులో మా వైఖరి చాలా స్ఫష్టంగా ఉంది. ఆ ఆర్టికల్ దుర్వినియోగం చేయడాన్ని గతంలో వ్యతిరేకించాం..భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం.
న్యూస్ 18: ఈ రకమైన ఆరోపణలు చేస్తున్న మమతా బెనర్జీకి మీ మద్దతు ఉంటుందని భావించాలా?
సీతారాం ఏచూరి: రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిర పరచడంగానీ, తొలగించడానికి ప్రయత్నిస్తే.. ఆ స్థానంలో ఎవరున్నా సీసీఎం దానిని ఖండిస్తుంది.
న్యూస్ 18: పశ్చిమ బెంగాల్ బీజేపీ మమతా బెనర్జీని టార్గెట్ చేసిందని మీరు నమ్ముతున్నారా?
సీతారాం ఏచూరి: చాలా సందర్భాల్లో మేము విమర్శనాత్మకంగా ఉన్నాం.. ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండించాం. గవర్నర్ తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న విషయాన్ని పక్కకుపెట్టి.. తన వచ్చే నివేదికలను అమలు చేస్తారు. ఆర్‌ఎస్ఎస్ ప్రచారకులుగా ఉన్నవారిని గవర్నర్లుగా నియమించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్థానాన్ని తక్కువచేసింది.
న్యూస్ 18: ఇక, కేరళ విషయానికి వస్తే మీ పార్టీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితులు బాగా దిగజారాయని అంటున్నారు. భావజాలం గురించి గొప్పగా చెప్పే సీపీఎం పార్టీకి నాయకుడిగా మీరు దీనిపై ఏమంటారు?. ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవారి సన్నిహతులపై ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అది పార్టీపై ప్రభావం చూపదా?.. ఇబ్బందికర పరిస్థితులకు దారితీయదా?
సీతారాం ఏచూరి: కేరళలో మీరు చెప్పినంతగా పరిస్థితి ఉందని నేను అనుకోను. ఆరోపణలు అనేవి ఎవరి మీద అయినా ఎప్పుడైనా, ఎవరి నుంచి అయినా రావచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వం గానీ, పార్టీ గానీ ఎలాంటి వైఖరి అవలంభించారన్నది ముఖ్యం. ముఖ్యమంత్రి మాజీ పర్సనల్ సెక్రటరీ మీద ఆరోపణలు వచ్చాయి. అతనో ఐఏఎస్ అధికారి అని గుర్తుంచుకోవాలి. ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.. వారిని రాష్ట్రాలకు పంపుతోంది.. కానీ వారికి క్యాడర్స్ ఉంటాయి.. కేంద్రం కిందే వారు పనిచేయాలి. ఇందులో కేరళ ప్రభుత్వం ప్రమేయం ఏముంది?. అయినా అటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అతనిని ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయం స్మగ్లింగ్‌కు సంబంధించి కావున కేంద్రం పరిధిలోని అంశం. ఇందుకు కేంద్ర చట్టాలు ఉన్నాయి.. వాటికి అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు ఆధారంగా దోషిగా తేలినవారిని చట్టప్రకారం శిక్షించాలి. అందుకే కేరళలో మేము చాలా బాగానే ఉన్నాం. నేను చెప్పేది.. అన్నిరకాలుగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోమ్మని.
న్యూస్ 18: ఇలాంటి ఆరోపణలను ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఇలాంటివి మీ పార్టీ నైతికతను దెబ్బతీయవా?
సీతారాం ఏచూరి: మీరు చూస్తున్నారు. అవగాహన అనేది మీడియా సృష్టిస్తున్నది. కానీ ప్రజలు అవగాహన చేసుకునేది మరో రకంగా ఉంటుంది. మీడియా ప్రజలను భయపెట్టే విధంగా ఉండకూడదు. ఇది చాలా కేసుల్లో మీరు చూస్తున్నారు. ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటే ఏం జరిగిందో మీరంతా చూశారు. మీడియా ఏం సృష్టించింది.. వాస్తవానికి ఏం తేలింది?. అందుకే కేరళ ప్రజల వద్దకు వెళ్లండి. వాళ్లు ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది.
న్యూస్ 18: అక్కడ మీ రాష్ట్ర కార్యదర్శి కొడుకు అరెస్ట్ చేశారు.. మరీ దానిపై ఏమంటారు?
సీతారాం ఏచూరి: ఆ రాష్ట్ర కార్యదర్శి కొడుకు పార్టీ సభ్యుడు కాదు. తన కొడుకుపై ఏ విధమైన ఆరోపణలతో అరెస్ట్ చేశారో వాటి ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆ రాష్ట్ర కార్యదర్శి కోరారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణలో అతడు దోషిగా తెలితే అతన్ని శిక్షించాలని కూడా చెప్పారు. మా పార్టీ ఎవరిని కాపాడటం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేస్తున్నాను.
న్యూస్ 18: కేరళలో మీరు చాలా కీలకమైన ఎన్నికలకు వెళ్లనున్నారు. అందువల్ల ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు వాటిని ఎలా చూస్తారు. ఈ విషయాల్లో మీవైపు నుంచి రాష్ట్ర పార్టీపై, కమిటీలపై ఎటువంటి ఒత్తిడి ఉండదా? ఇలాంటి ఆరోపణలే పదే పదే ఎందుకు వస్తున్నాయి?
సీతారాం ఏచూరి: ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అందుకే అన్ని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఏం చేయగలం.. ఏదైనా సరే విచారణ జరగాలి, దోషిగా తేలితే శిక్షపడాలి. ఎవరిని ఏవిధంగా రక్షించే సమస్యే లేదు.
న్యూస్ 18: మీ రాష్ట్ర కార్యదర్శి ఏదో విధంగా ఆ వివాదంలో చిక్కుకున్నట్టుగా దర్యాప్తు రుజువు చేస్తే.. అప్పుడేం చేస్తారు?
సీతారాం ఏచూరి: అలా జరిగినప్పుడు చుద్దాం. ఏదైనా జరగనివ్వండి. అతని కొడుకు చాలా కాలంగా స్వతంత్రగా తన పనులు తాను చూసకుంటున్నాడని రాష్ట్ర కార్యదర్శి చెప్పారు. అతనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని కూడా అన్నారు. అతని కొడుకు ఏదో చేస్తే దానికి పార్టీ సమాధానం చెప్పదు. అతడి తండ్రికి సంబంధించినంత వరకు విచారణ జరిపించమనే కోరుతున్నాం.
న్యూస్ 18: పశ్చిమ బెంగాల్‌లో మీరు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఇక, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు దీనిని ఎలా చూడాలి.
సీతారాం ఏచూరి: ప్రజలు అయోమయంలో పడతారని నేను అనుకోను. వారు వాస్తవికతతో ఆలోచిస్తారు. ఇది ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా జరిగింది. 2004లో మేము బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడే ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించాం. మేము సెక్యూలర్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం పనిచేశాం. అటువంటి సందర్భంలో కేరళలో కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారు. అక్కడ 20 సీట్లలో 18 సీట్లు లెఫ్ట్ ఫ్రంట్ గెలుచుకుంది. ఇది కేంద్రంలో కాంగ్రెస్ ఏర్పాటుకు మైనస్ కాలేదు. ఇది ప్రజల పరిణతితో ఆలోచిస్తారని స్పష్టం చేసింది.
న్యూస్ 18: బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహాకూటమిపై మీ అంచనాలు ఏమిటి? అక్కడి వామపక్ష నాయకులకు మీరు ఏం చెప్తారు.
సీతారాం ఏచూరి: సామాజిక న్యాయమే ఒకటే కాదు ఆర్థిక న్యాయం కూడా ముఖ్యమని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు. వామపక్షాలు అభివృద్ది చేసిన ఈ ఎజెండాపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ విషయాన్ని వారు ప్రతిరోజు ప్రచారంలో చెబుతూనే ఉన్నారు. తేజస్వీ రోజుకు 16కి పైగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీన్ని నేను అభినందించాలి. అతని తండ్రి లాలూప్రసాద్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓ సమయంలో లాలుతో కలిసి నేను హెలికాఫ్టర్‌లో పర్యటించాను.మేము అప్పుడు అత్యధికంగా 12 చేశాం. తేజస్వీ ప్రజల వద్దకు వెళ్లి వారి స్పందనను తెలుసుకుంటున్నారు.
న్యూస్ 18: బిహార్‌లో సీట్ల గురించి ఏం చెప్తారు?
సీతారాం ఏచూరి: మనం వేచి చూడాల్సి ఉంది. చాలా అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ డబ్బుతో ఆటను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రతి ప్రసంగం మతానికి ముడిపడి ఉంటుంది. హిందూ ఓటర్లను ఏకం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇది ఓటర్లపై ఏరకమైన ప్రభావం చూపెడుతుందో తేలియాల్సి ఉంది. ప్రసుత్తం బిహార్ ప్రజల నుంచి మాకు వస్తున్న స్పందన బాగుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, CPM, West Bengal