రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్‌తో పాటు సచిన్ పైలట్ కూడా చివరి వరకు పోటీపడ్డారు. చివరకు డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్‌లో వారి చేత ఆ రాష్ట్ర గవర్నర్ కల్యాణ్ సింగ్ ప్రమాణం చేయించారు. ఐదేళ్ల విరామం తర్వాత అక్కడ అధికార పగ్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.
ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హూడా సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అటు విపక్ష నేతలు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దెవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్‌జేడీ నేత శరద్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, జేవీఎం నేత బాబూలాల్ మరాండి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధర రాజె కూడా పాల్గొన్నారు. మొన్నటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 199 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది.
Congratulations to the new CM & Deputy CM of Rajasthan, Shri @ashokgehlot51 & Shri @SachinPilot #IndiaTrustsCongress pic.twitter.com/kuZjLpE46r
— Congress (@INCIndia) December 17, 2018
రాజస్థాన్ సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్‌కు తరలివచ్చారు.
Rajasthan: Congress leaders and workers gather at Albert Hall, Jaipur. Ashok Gehlot and Sachin Pilot will take oath as Chief Minister and Deputy Chief Minister respectively later today. pic.twitter.com/PJ9ZuVTfJR
— ANI (@ANI) December 17, 2018
Former PM Dr. Manmohan Singh, Congress President @RahulGandhi & opposition leaders from across the country gather in Rajasthan for the swearing in ceremony of CM @ashokgehlot51 & Deputy CM @SachinPilot #IndiaTrustsCongress pic.twitter.com/BRFShH4fkF
— Congress (@INCIndia) December 17, 2018
అశోక్ గెహ్లాట్ ప్రొఫైల్...
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ఇప్పుడు మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. 67 ఏళ్ల గెహ్లాట్ తొలిసారిగా 1998లో రాజస్థాన్ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి 2008-2013 వరకు రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. గతంలో రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేయడంతో పాటు పలుసార్లు రాజస్థాన్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన గెహ్లాట్...ఆ తర్వాత మరో నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి సర్దార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఏఐసీసీలో పలు హోదాల్లో పనిచేశారు. సైన్స్‌లో గ్రాడ్యుయేట్, ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్యాడ్యుయేట్ అయిన గెహ్లాట్ ‘లా’ కూడా చదివారు. సునితా గెహ్లాట్‌ను ఆయన పెళ్లాడారు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
మాయావతి, అఖిలేష్, మమత డుమ్మా
కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం తరహాలోనే...ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విపక్షాల ఐక్య వేదికగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ప.బంగ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. యూపీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న విభేదాల కారణంగానే మాయావతి, అఖిలేష్ యాదవ్ ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కుదరని పక్షంలో తామిద్దరూ కలిసి యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ, ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తదుపరి కార్యక్రమాలు
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్ నాథ్ మధ్యాహ్నం 1 గంటకు భోపాల్‌లో ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. అలాగే ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ భూపేశ్ బగేల్ రాయ్‌పూర్‌లో సాయంత్రం 4 గం.లకు ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.
ఇది కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Rajasthan