హోమ్ /వార్తలు /national /

Dubbaka By Election: దుబ్బాకలో వెనుకబడ్డ కాంగ్రెస్.. టీఆర్ఎస్ వ్యూహమేనా ?

Dubbaka By Election: దుబ్బాకలో వెనుకబడ్డ కాంగ్రెస్.. టీఆర్ఎస్ వ్యూహమేనా ?

 ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించండి ..ఉత్తమ్  ఉత్తమ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించండి ..ఉత్తమ్ ఉత్తమ్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Dubbaka By Election: టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్ రావు సహా మిగతా నేతలంతా బీజేపీనే ఎక్కువగా విమర్శిస్తున్నారు.

  తెలంగాణలో ఇప్పుడు దుబ్బాక ఎన్నికల చుట్టే రాజకీయం నడుస్తోంది. మరో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉండటంతో.. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు, వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. కాంగ్రెస్ కూడా నియోజకవర్గంలో బాగానే ప్రచారం చేస్తోంది. అయితే దుబ్బాక ఎన్నికల రణరంగంలో... బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త ప్రచారంలో వెనుకబడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ తరపున మాజీమంత్రి ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఒకదశలో ఆయనే టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం కూడా సాగింది.

  అయితే బీజేపీ అభ్యర్థి బంధువు ఇంటి సమీపంలోని ఇంటిలో డబ్బు దొరకడం... దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగడంతో సీన్ మారిపోయింది. దీనికితోడు అటు టీఆర్ఎస్ నేతలు బీజేపీని... బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తుండటంతో.. ట్రయాంగిల్ ఫైట్‌గా ఉంటుందని భావించిన దుబ్బాక ఉప ఎన్నికల పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారనుందా ? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారానికి అంతగా ప్రాధాన్యత లేకుండా చేయడం కూడా టీఆర్ఎస్ వ్యూహంలో భాగమే అనే అభిప్రాయం కూడా ఉంది.

  కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలో చాలావరకు గుర్తింపు ఉంది. దీనికితోడు ఆయన తండ్రి, దివంగత చెరుకు ముత్యంరెడ్డికి ఉన్న మంచి పేరు కూడా ఆయనకు కలిసొచ్చే అంశమన్నది ఎవరూ కాదనలేని విషయం. ఈ కారణంగానే శ్రీనివాసరెడ్డి గురించి పెద్దగా అంతా చర్చ జరగకుండా... టీఆర్ఎస్ ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తోందనే టాక్ కూడా ఉంది. ఇలా చేయడం వల్ల టీఆర్ఎస్, బీజేపీ ద్విముఖ పోటీలో తమకు లబ్ది కలగడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బకొట్టొచ్చన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

  అందుకే టీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్ రావు సహా మిగతా నేతలంతా బీజేపీనే ఎక్కువగా విమర్శిస్తున్నారు. వాళ్లెవరూ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అభ్యర్థిని శ్రీనివాసరెడ్డిని పెద్దగా విమర్శించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ కారణంగానే కాంగ్రెస్ నేతలు దుబ్బాకలో పర్యటించిన ప్రచారం చేస్తున్నా... ఉప ఎన్నికల ప్రచార హోరు మొత్తం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బాహాటంగా బీజేపీని, సైలెంట్ వ్యూహంతో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్... దుబ్బాకలో ఎవరిపై ఎక్కువగా పైచేయి సాధిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Congress, Dubbaka By Elections 2020, Telangana, Trs

  ఉత్తమ కథలు