హోమ్ /వార్తలు /national /

Dubbaka By-Election: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే.. ఖరారు చేసిన టీపీసీసీ!

Dubbaka By-Election: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే.. ఖరారు చేసిన టీపీసీసీ!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By-Election: దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా హై కమాండ్ కు ప్రతిపాదించాలని ఆదివారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో రాజకీయ కాకరేపుతున్న దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్ఠానానికి ప్రతిపాదించాలని ఆదివారం జరిగిన ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఏఐసీసీకి నర్సారెడ్డి పేరును మాత్రమే పంపించినట్లు సమాచారం. అధిష్ఠానం ఆమోదం పొందిన అనంతరం ఆయన పేరును ప్రకటించనున్నారు. అయితే నర్సారెడ్డితో పాటు శ్రవణ్ ‌కుమార్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డిల పేర్లకు కూడా చర్చకు వచ్చాయి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మెజారిటీ నేతలు నర్సారెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గుచూపారు. దీంతో ఆయన పేరు ఫైనల్ చేశారు. హరితప్లాజాలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సిహా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  బీజేపీ అభ్యర్థిగా రఘునందన్..

  దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఆ పార్టీ దుబ్బాక ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నుంచి ఆయన ఒక్క పేరునే అధిష్ఠానానికి పంపించినట్లు సమాచారం. నేడే, రేపో ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే రఘునందన్ రావు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతీ గ్రామం తిరుగుతూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి చుట్టూ ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చితే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాకపై వివక్ష చూపుతోందన్న అంశాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

  అధికార పార్టీ అభ్యర్థిగా సోలిపేట సతీమణి?

  దుబ్బాక టికెట్ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయితే మంత్రి హరీశ్ రావు మాత్రం దుబ్బాకలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యర్తలతో నిత్యం సమావేశమవుతూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం దాదాపు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే అదే పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి మాత్రం టికెట్ కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు. మరో వైపు తన మద్దతుదారులతో సమావేశాలను నిర్వహిస్తూ టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే టీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana Politics

  ఉత్తమ కథలు