హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాపై కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం

మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాపై కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం

ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీర్‌లో కాశ్మీరీ జెండా ఎగరేసే వరకు జాతీయ జెండాను ఎగురవేయబోమని మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది.

  జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌లో కాశ్మీరీ జెండా ఎగరేసే వరకు జాతీయ జెండాను ఎగురవేయబోమని మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఆమె జాతీయతకు సంబంధించి అన్ని హద్దులతో దాటారని వ్యాఖ్యానించింది. కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో మాజీ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, పోలీసు అధికారులు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రిటైర్డ్ నేవీ అధికారులు, విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. 267 మంది ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన జారీ చేశారు. నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం, ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం జాతీయ జెండాను మాటలతో కానీ, రాతలతో కానీ, చేష్టలతో కానీ అవమానించడం నేరం. కనీసం మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ పడొచ్చు. మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించినట్టేనని అభిప్రాయపడ్డారు. ముఫ్తీ వ్యాఖ్యల వల్ల కాశ్మీర్‌లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది.

  ఎవరైనా ఒక వ్యక్తి ప్రజల సాధారణ జీవనానికి అవరోథం కలిగిస్తున్నారని భావిస్తే జమ్మూకాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ 1978 ప్రకారం వారిని అరెస్టు చేసే అధికారం ఉంటుంది. అయితే, గుప్‌కార్ గ్యాంగ్ హెడ్ అయిన ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరీ జెండాను ఎగరేసే వరకు జాతీయ జెండాను ఎగరేయబోమని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలుగా అభివర్ణించడాన్ని తప్పు పట్టారు.

  అలాగే, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370‌ను రద్దు చేయడానికి ఒకరోజు ముందు గుప్‌కార్ డిక్లరేషన్ చేయడాన్ని కూడా కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్, స్వయం ప్రతిపత్తి, గుర్తింపును కాపాడతామని వ్యాఖ్యానించడాన్ని ఖండించింది. అది వన్ ఇండియాకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఏడాది తర్వాత మరోసారి ఆ గ్యాంగ్‌లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం భారతీయ ఐక్యతను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.

  తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామంటూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నాళ్ల నుంచో చెబుతున్న మాటలను గుర్తంచుకోవాలని చెప్పింది. అలాగే, సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసేదేమీ కాదని భావించింది. అది కూడా నిజమైన ఐక్యత కోసం చేసిన పనిగా అభివర్ణించింది.

  గతంలో కాశ్మీరీ పండిట్ల మీద జరిపిన మారణకాండను ఈ సందర్భంగా కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా గుర్తు చేసింది. రాజ్యంగం వారికి కల్పించిన హక్కులను కాలరాసిన సందర్భాల్లో వీరు ఏమయ్యారని ప్రశ్నించింది. అసలు, ఈ గుప్‌కార్ గ్యాంగ్‌లో మెజారిటీ వర్గం కాశ్మీరీ పండిట్లు, హిందువులు, సిక్కుల ఊచకోతకు కారకులేనని అభిప్రాయపడింది. వేలాది మంది హక్కులను కాలరాశారని, వారిని (కాశ్మీరీ పండిట్లు) సొంత గడ్డ మీద రెండో శ్రేణి పౌరులుగా మార్చి, వారికి దక్కాల్సిన హక్కులను దక్కుండా చేశారన్నారు.

  ఇక ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా లాంటి వారు అవినీతిలో కూరుకుపోయి, కేంద్రం తెచ్చిన పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేయకుండా పాలన సాగించారని గుర్తు చేశారు. అలాగే, రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో కూడా విఫలమయ్యారని విమర్శించారు. వారు చేసిన వ్యాఖ్యల (కాశ్మీరీ జెండాను ఎగరేస్తేనే జాతీయ జెండాను ఎగరేస్తాం.) వల్ల కాశ్మీర్‌లో ఆర్థికాభివృద్ధి ఆగిపోతుందన్నారు. చైనా సాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్దుల్లా చెప్పడాన్ని కన్సర్డ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీవ్రంగా తప్పుపట్టింది. ముఫ్తీ, అబ్దుల్లా పలికే పలుకులే పాకిస్తాన్ కూడా పలకడాన్ని చూస్తుంటే వారి అసలు రంగులు బయటపడుతున్నాయని చెప్పింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడే ఇలాంటి వారికి చెత్తబుట్టలో మాత్రమే స్థానం లభిస్తుందని తెలిపింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Jammu and Kashmir, Mehbooba Mufti, Omar Abdullah

  ఉత్తమ కథలు