రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటుంటారు నేతలు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్... సీఎం జగన్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్భలంతోనే పవన్ కళ్యాణ్ ఈ రకంగా తమపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు బహిరంగ విమర్శలు కూడా చేస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్‌కు కట్టడి చేసే క్రమంలో సీఎం జగన్ కొత్త ప్లాన్ వేశారని... దాన్ని అమలు చేసే భాగంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పరామర్శించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు సాగిన వామపక్షాలు... ఆ తరువాత పవన్‌కు దూరం జరుగుతూ వచ్చాయి. మొన్న విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌కు సైతం సీపీఐ, సీపీఎం దూరంగా ఉన్నాయి. దీంతో సీఎం జగన్ గతంలో పవన్‌కు సన్నిహితంగా ఉన్న వామపక్షాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పరామర్శించారని సమాచారం.
ఉన్నట్టుండి జగన్ ఆయనను కలవడం, పరామర్శించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనని పలువురు చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు వామపక్షాలను దూరం చేయడం ద్వారా ఆయన బలం కొంత మేర తగ్గుతుందని... అదే సమయంలో వామపక్షాలు వైసీపీ వెంట నడిస్తే... స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా విపక్షాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేలా చూస్తున్న చంద్రబాబు వ్యూహం కూడా బెడిసి కొడుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ సరికొత్త ప్లాన్... ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టుగా ఉండబోతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu Naidu, CPI, CPM, Janasena, Pawan kalyan