వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఎక్కువగా అధికారులతోనే సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా మారిపోయారు సీఎం జగన్. ఈ ఏడాది కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీని అన్నిస్థాయిల్లో యాక్టివేట్ చేసే పనిలో వైసీపీ అధినాయకత్వం నిమగ్నమైంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న నేతలతో విజయసాయిరెడ్డి వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్న విజయసాయిరెడ్డి...లేని విషయాలను ప్రచారం చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని వారికి తెలిపారు. అధికార ప్రతినిధుల పనితీరును పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని... ఉన్న పథకాల గురించే ప్రజల్లోకి తీసుకెళ్తే వైసీపీకి తిరుగుండదని అన్నారు. ఇకపై ప్రతి రోజూ రాజకీయ పరిణామాలపై సమీక్షలు ఉంటాయని వారికి స్పష్టం చేశారు. అయితే వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి పార్టీ నేతలతో సమీక్షలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లాక్డౌన్ నుంచి కేంద్రం భారీ సడలింపులు ఇవ్వడంతో... ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే కారణంగానే వైసీపీ పార్టీపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విపక్షాల రాజకీయ దాడిని క్షేత్రస్థాయి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ భావిస్తోందని... అందుకే ఈ రకమైన చర్యలు తీసుకుంటోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఉన్నట్టుండి వైసీపీ పార్టీపై ఫోకస్ చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Vijayasai reddy, Ysrcp