ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తనదైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన నిర్ణయాలపై ఎవరెన్ని విమర్శలు చేసినా... వాటిని అమలు చేసి తీరాలన్నట్టుగా జగన్ తీరు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఏపీ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలని భావించిన వైసీపీ... తాజాగా ఆ దిశగా అడుగులు వేస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయంపై సీరియస్గా దృష్టిపెట్టిన సీఎం జగన్... కొత్త ప్రాంతీయ బోర్డుల విషయంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను కొద్ది రోజుల క్రితమే ఆదేశించారని సమాచారం.
పలు ప్రాంతాలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకు సాగుతాయనే భావనలో సీఎం జగన్ ఉన్నట్టు వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ప్రత్యేకంగా నిధులను కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రైతాంగ, గ్రామీణ ప్రాజనీకం, వెనకబడిన జిల్లాల అభివ్రుద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రాంతీయ బోర్డులను జగన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం.
విజయనగరం కేంద్రంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక బోర్డు, అలాగే ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా కలుపుకుని మరో ప్రాంతీయ బోర్డు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో ఇంకో బోర్డు, రాయలసీమ నాలుగు జిల్లాలను కలుపుకుని మరో బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బోర్డు చైర్మన్లకు కేబినెట్ ర్యాంక్ కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Rayalaseema, TDP, Ysrcp