ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కుట్రపూరితంగానే ఆలయాలపై దాడులు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పరిపాలనను ఎదుర్కొవడం కష్టమనే కుట్రలు, కయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేనిస్థితికి వ్యవస్థ దిగజారిపోయిందని.., దేవుడి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దారుణమైన పరిస్థితులున్నాయి. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్న వారు మనుషులేనా అని సీఎం ప్రశ్నించారు. ఆలయాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభమో..!దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎవరికి చెడ్డపేరు వస్తుందో..! ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంటే సరిగ్గా.. పథకం ప్రారంభానికి ముందు రోజుగానీ.. ఆ తర్వాత గానీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా సీఎం వివరించారు. ప్రభుత్వ పథకాలకు వస్తున్న పబ్లిసిటీని దారిమళ్లించేందుకు దేవుడు గుళ్లపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
సీఎం ఉదాహరణలు ఇవే..,
ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుండగానే రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు.
దాడులు జరిగిన ఆలయాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల అధీనంలో ఉన్నవేననని సీఎం జగన్ ఆరోపించారు. అర్ధరాత్రి దాడులు చేసి.. తర్వాత రోజు ఉదయం సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను టీడీపీ చేపడుతోందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు పోరాడాలని పిలుపునిచ్చారు. దేవుడితో రాజకీయాలు చేస్తున్న ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Hindu Temples, Tdp, Ysrcp