అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని బీజేపీ, జనసేన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై నిజానిజాలను వెలికి తీయడంలో ఏపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని టీడీపీ మండిపడుతోంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా వైసీపీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రథ దగ్ధం ఘటన వెనక చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ప్రవాస ఆంద్రుడిలా హైదరాబాద్లో ఉంటూ ఏపీలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''రథం దగ్ధం వ్యవహారంలో చంద్రబాబు హస్తముంది. హైదరాబాద్లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకుంటున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది.'' అని విజయసాయిరెడ్డి అన్నారు.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కేసును సీబీఐకి అప్పగించాలని గురువారం డీజీపీని ఆదేశించారు సీఎం జగన్. ఆ మేరకు హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో అంతర్వేది ఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం జీవో జారీ చేసింది. అంతర్వేది ఘటనపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని... నిజాలు నిగ్గు తేల్చేందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని హోం మంత్రి సుచరిత చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
కాగా, సెప్టెంబరు 5న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు భగ్గుమన్నారు. రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేదంటే కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. అంతేకాదు చలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Vijayasai reddy