పండుగలకు ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులకు, పేదలకు శుభవార్త అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు (Central Government Employees) డీఏను పెంచడంతో పాటు మరో మూడు నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ (Garib Kalyan Yojana) అన్న యోజనను పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో పాటు సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం సౌకర్యంగా ఉండేలా పది వేల కోట్ల రూపాయలతో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సిఎస్‌ఎంటి-ముంబై రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ(Centre Cabinet Decisions) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలపారు.
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిలీఫ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను అందజేస్తామని తెలిపారు. 2022 జూలై 1 నుంచి ఇది వర్తిస్తుందని తెలిపారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ.12,852 కోట్లు ఖర్చవుతుందని ఠాకూర్ చెప్పారు. 2022 జూలై నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల కాలంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఖజానా నుంచి రూ.8,588 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గడువును ప్రభుత్వం బుధవారం పొడిగించింది.
దీంతో డిసెంబర్ 2022 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. దీనికి రూ. 44,700 కోట్లు ఖర్చవుతుంది. ఈ పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా ఐదు కిలోల గోధుమలు మరియు బియ్యం అందజేస్తున్నారు. ద్రవ్యోల్బణం నుంచి పేదలకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
హీట్ ను పెంచుతున్న పంజాబ్ రాజకీయాలు.. గవర్నర్ వర్సెస్ సీఎం.. ఎందుకంటే..
దీంతో పాటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి రూ.10,000 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మొత్తం 199 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో వదంతులు నమ్మొద్దని కేంద్రమంత్రి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central cabinet, PM Narendra Modi