హోమ్ /వార్తలు /national /

తెలంగాణలో ఎయిమ్స్.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

తెలంగాణలో ఎయిమ్స్.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

కేసీఆర్, మోదీ

కేసీఆర్, మోదీ

తెలంగాణలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ స్థాపనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సుమారు 1028 కోట్ల వ్యయ అంచనాతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు సుమారు రూ. 1,028 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ సంస్థ ఏర్పాటు వల్ల వైద్యకళాశాల, 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు, వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

వైద్యకళాశాల సహా అన్ని ఏర్పాట్లనూ 45 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఓపీలో 1500 మంది, ఇన్ పేషంట్‌ విభాగంలో 1000 మంది రోగులకు ఒకేసారి వైద్యం లభించేలా ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్‌ను కేటాయించాలంటూ.. రాష్ట్రప్రభుత్వం అనేకదఫాలుగా కేంద్రానికి లేఖలు రాసింది. పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధానిని, సంబంధిత మంత్రిని కలిసి విన్నవించారు. అయితే ఆఖరు బడ్జెట్‌లోనూ ఎయిమ్స్ ఊసెత్తకపోవడంతో ఆ అంశం మూలకు పడినట్టే అనుకున్నారు. తాజాగా కేంద్రమంత్రి వర్గం తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో.. రాష్ట్ర ప్రభుత్వ పోరాటం ఫలించనట్టైంది. ఇక, తెలంగాణతో పాటు తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

First published:

Tags: CM KCR, Nalgonda, Pm modi, Tamilnadu, Telangana, Telangana News

ఉత్తమ కథలు