హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ramnath kovind Speech: జాతీయ జెండాకు అవమానం.. రైతుల ఆందోళనలు, కొత్త చట్టాలపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

Ramnath kovind Speech: జాతీయ జెండాకు అవమానం.. రైతుల ఆందోళనలు, కొత్త చట్టాలపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం

Budget Session 2021: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో నెలకొన్న హింసాత్మక ఘటనలు బాధించాయి. పవిత్రమైన రోజున భారత జాతీయ జెండాకు అవమానం జరగడం దురదృష్టకరంమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.

జనవరి 26న ఢిల్లీలో జాతీయ జెండాకు జరిగిన అవమానం దురదృష్టకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రైతుల సంక్షేమం కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తెచ్చిందని.. వాటిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. కరోనా సంక్షోభం కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆత్మ నిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహ్మమారిపై భారత పోరాటం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

'''స్వయం సమృద్ధి సాధించడం భారత్‌కు ఓ స్వప్నం. కరోనా తెచ్చిన సంక్షోభం ఆ కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. దేశంలో రెండు స్వదేశీ వ్యాక్సిన్‌లు తయారయ్యాయి. మన దేశ ప్రజలకు టీకాలు అందించడమే గాక.. అనేక దేశాలకు టీకాలను అందజేస్తున్నాం. కరోనా లాంటి సంక్షోభం సమయంలో పొరుగుదేశాలతో కలిసి ముందుకు సాగుతున్నాం.'' అని రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

''రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను తీసుకొచ్చాం. కానీ కొందరు విపక్షల నేతలు తప్పుడు ప్రచారం చేసి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలు రైతులకు కొత్త అవకాశాలు, హక్కులను కల్పిస్తాయి. అన్ని వర్గాలతో విస్తృత చర్చల తర్వాతే కొత్త చట్టాలను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలను మద్దతు ధరలను పెంచుతున్నాం. సాగు చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం.'' అని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.


''గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో నెలకొన్న హింసాత్మక ఘటనలు బాధించాయి. పవిత్రమైన రోజున భారత జాతీయ జెండాకు అవమానం జరగడం దురదృష్టకరం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను మన రాజ్యాంగం కల్పించింది. అదే రాజ్యాంగం చట్టాలు, నిబంధనలు పాటించాలని కూడా చెబుతోంది.'' అని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.


రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

భారత చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకం. ఈ బడ్జెట్ సమావేశాలతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం.

తుపాన్ల నుంచి మొదలుకొని కరోనా వైరస్, బర్డ్‌ ఫ్లూ వరకు భారత్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి సమస్యను దేశమంతా కలిసికట్టుగా ఎదుర్కొంది. ఇదే స్ఫూర్తితో ముందకు కొనసాగాలి.

కరోనా మహమ్మారి తర్వాత జరుగుతున్న సమావేశాలు ఇవి. ప్రపంచంలో ప్రతి వ్యక్తిని కోవిడ్-19 ప్రభావితం చేసింది. లక్షలాది మంది మరణించారు. ప్రణబ్‌ ముఖర్జీ లాంటి ఎంతో మంది గొప్ప నేతలు మనకు దూరమయ్యారు.

కరోనాపై భారత దేశం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయం. పూర్తి శక్తిసామర్థ్యాలతో వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. సమయానుకూల నిర్ణయాలతో కరోనాను కట్టడిచేసి.. లక్షలమంది పౌరుల ప్రాణాలను కాపాడుకోగలిగాం. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి.

మన దేశంలో రెండు స్వదేశీ కరోనా వాక్సిన్‌లను తయారు చేసుకోగలిగాం. కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిస్తున్నాం.

దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. జన ఔషధి పరియోజన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 7వేల కేంద్రాల్లో చౌక ధరకే ఔషధాలు అందిస్తున్నాం. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం.

కొత్త పార్లమెంట్ నిర్మాణానికి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏటే పార్లమెంట్ భవనం నిర్మాణ జరగడం యాధృచ్చికం. కొత్త పార్లమెంట్ భవనంలో ఎన్నో సదుపాయాలను కల్పిస్తున్నాం.

గత ఏడాది గల్వాన్ లోయలో 20 మంది జవాన్లు దేశ కోసం ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను భారత జాతి మరవదు. జాతీయ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎల్ఏసీ వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించాం.

ఈశాన్య రాష్ట్రాల్లో అతివాదం ముగింపు దశకు చేరుకుంది. హింసాత్మక ఘటనలు తగ్గుతున్నాయి. యువతలో మార్పు వస్తోంది. యువకులు అభివృద్ధి వైపు, జాతి నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.

పేదల కోసం వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌ కార్డు అమలు చేశాం. ఇప్పుడు ఎక్కడైనా రేషన్ తీసుేకోవచ్చు. కరోనా సమయంలో జన్‌ధన్‌ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్‌ కల్యాణ్‌ యోజన అమలు చేశాం. 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నాం. రూ. లక్షా 13వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశాం. మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 20వేల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. వ్యవసాయ ఉత్పత్తులు దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చిన్న, సన్నకారు రైతులపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

First published:

Tags: Budget 2021, Farmers Protest, Parliament, Ramnath kovind

ఉత్తమ కథలు