హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాహుల్‌పై ఈగను వాలనివ్వని మాయ, లాలూ!

రాహుల్‌పై ఈగను వాలనివ్వని మాయ, లాలూ!

మాయావతితో సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

మాయావతితో సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

రాహుల్ గాంధీపై నోరుపారేసుకున్నందుకు తమ పార్టీ నేతలను బయటకు పంపిన బీఎస్పీ, ఆర్జేడీలు...కాంగ్రెస్‌తో సంబంధాలకు తామిస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెబుతున్నాయి.

  రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే విషయంలో కొందరు నేతలు లక్ష్మణ రేఖ దాటేస్తూ తమ పదవులకు ఎసరు తెచ్చుకుంటున్నారు.  పరుష పదజాలంతో కూడిన వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తమ పార్టీలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. పార్టీ అధిష్టానం మెప్పు పొందాలన్న ఉద్దేశంతో అతి వినయం ప్రదర్శించే అలాంటివారి విషయంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కాస్త కఠినంగానే వ్యవహరించాయి. ముందు వెనుక ఆలోచించకుండా పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి బయటకు సాగనంపాయి.  తద్వారా రాహుల్ గాంధీపై ఈగను కూడా వాలనివ్వమన్న సంకేతాలు పంపుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీతో సంబంధాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యతను వారు చెప్పకనే చెబుతున్నారు.

  రాహుల్ గాంధీ విదేశీయుడని, ఆయన దేశ ప్రధాని అయ్యేందుకు వీలులేదంటూ గత వారం బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ జై ప్రకాష్ నోరుపారేసుకున్నారు. పార్టీ అధినేత్రి మాయావతిని దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని, మోదీని ఢీకొనే దమ్ము అమె ఒక్కరికే ఉందని ఆయన తేల్చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్-బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో జై ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో పార్టీ నేత జై ప్రకాష్‌పై మాయావతి తీవ్రంగానే స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు జై ప్రకాష్ వాడిన భాష సరిగ్గా లేదని, ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని ఆమె స్పష్టంచేశారు. తక్షణం ఆయన్ను పార్టీ జాతీయ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. జై ప్రకాష్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపైనే ఉన్న పార్టీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ ఈ విషయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేసిన బీఎస్పీ..ఆయన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

  ఇదిలా ఉండగా రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన సొంత పార్టీ నేతలపై ఆర్జేడీ వేటువేసింది. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడం పిల్ల చేష్టగా ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి శంకర్ చరణ్ త్రిపాఠి అభివర్ణించారు. మోదీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపై స్పందించిన శంకర్ చరణ్ త్రిపాఠి...2019లో ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలవనున్న వ్యక్తి నుంచి ఇలాంటి చర్యను ఆశించలేదని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో రాహుల్ ప్రసంగం బాగా ఉందన్న ఆయన...అయితే ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవడం, కన్ను గీటడం సరైన పద్దతి కాదన్నారు. రాహుల్ చర్యను కన్నుగీటుతో రాత్రికి రాత్రి జాతీయ సెలబ్రిటీగా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌‌తో పోల్చారు. పార్టీకి నష్టం కలిగించేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సీరియస్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Bsp, Lalu Prasad Yadav, Mayawati, Rahul Gandhi

  ఉత్తమ కథలు