హోమ్ /వార్తలు /national /

బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)

‘బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని, బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం ఉంది.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

  తెలంగాణలో బీజేపీ ఆఫీసు ఎదుట ఆ పార్టీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నంపై మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నాన్ని అవకాశంగా మలుచుకుని, బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం ఉంది. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుప్రయత్నానికి తెరలేపి తద్వారా హైదరాబాద్‌లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. రేపు బీజేపీ హైదరాబాద్లో లాఠీచార్జి, పోలీసుకాల్పులు జరిగే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కుట్ర చేస్తుందనీ, ఈ మేరకు మాకు బీజేపీలోని నాయకులే మాకు సమాచారం అందించారు. ఇలాంటి సమాచారాన్ని రూఢి చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాం.’ అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర డీజీపీని తమ పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

  నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించినా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డీజీపీని టీఆర్ఎస్ పార్టీ కోరుతుందన్నారు. ఇంత నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బీజేపీ అబద్ధాలు, అసత్యా,లు, డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలకు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానన్నారు.

  ఎన్నికల కమిషన్‌కు కేటీఆర్ రాసిన లేఖ

  హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇటీవల అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బీజేపీ పార్టీ ఆఫీసు ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ‌కు 40 శాతం గాయాలు అయినట్టు తెలుస్తోంది. బాధితుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం (మ) తమ్మలోనిగూడెం అని తెలిసింది. ఎందుకు కాల్చుకున్నావని అక్కడున్న వారు ప్రశ్నించగా, ‘అన్నా. బండి సంజయ్ అంటే నాకు ప్రాణం. నా గుండె కోసిస్తా. పార్టీ కోసం ప్రాణమిస్తా.’ అంటూ శ్రీనివాస్ చేసిన కామెంట్స్‌ను పలు టీవీ చానల్స్ ప్రసారం చేశాయి.

  బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో దుబ్బాక ప్రచారం నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శ్రీనివాస్ కు సరైన చికిత్స అందేలా చూడాలని అందుబాటులో ఉన్న నాయకులకు సూచించారు.

  మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఓ హవాలా కేసులో కోటి రూపాయలు డబ్బు పట్టుకున్నామని, అందులో ఇద్దరినీ అరెస్టు చేశామని అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది సురభి శ్రీనివాస్ రావును అరెస్టు చేశాం. ఇతను చందా నగర్ కు చెందిన వ్యక్తి. మరో వ్యక్తి రవి కుమార్ (కార్ డ్రైవర్) మీద అరెస్ట్ చేసాం. ఇన్నోవా కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఫోన్ లో చాలా కీలక సమాచారం సేకరించాం. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘునందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు. రఘునందన్ రావు బావ మరిది శ్రీనివాస్ కు విశాఖ ఇండస్ట్రీ నుంచి కోటి రూపాయలు అందాయి. వాటిని హైదరాబాద్ మీదుగా దుబ్బాక తీసుకెళ్తున్నారు.’ అని అంజనీ కుమార్ తెలిపారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bandi sanjay, Dubbaka By Elections 2020, KTR, Telangana, Telangana bjp

  ఉత్తమ కథలు