హోమ్ /వార్తలు /national /

బీజేపీ వ్యూహం.. యానాంను ఏపీలో విలీనం చేయబోతున్నారా..?

బీజేపీ వ్యూహం.. యానాంను ఏపీలో విలీనం చేయబోతున్నారా..?

ప్రధాని నరేంద్ర మోదీ (File Photo)

ప్రధాని నరేంద్ర మోదీ (File Photo)

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాం జిల్లా ఏపీలో విలీనం కాబోతోందా ? రాజధాని పుదుచ్చేరి నుంచి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న యానాంపై భౌగోళికంగా, పాలనాపరంగా పట్టు సాధించలేమనే అంచనాకు కేంద్రం వచ్చేసిందా ? లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఎంట్రీ తర్వాత యానాంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనమా ? తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ అహ్మద్,న్యూస్18 ప్రతినిధి,అమరావతి)

  2024 నాటికి దేశవ్యాప్తంగా మరింత బలపడాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇందుకోసం భారీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు వాసనలు ఎక్కువగా కనిపించే పుదుచ్చేరిలో పాగా వేసేందుకు రెండేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ... మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపింది.అక్కడితో ఆగకుండా నిత్యం అక్కడ అధికారంలో ఉన్న నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నిర్ణయాలు తీసుకుంటోంది. పుదుచ్చేరిలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా తన అనుమతి తప్పనిసరి అని చెబుతున్న కిరణ్ బేడీ.. ప్రభుత్వ నిర్ణయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అయినా వీటిని లెక్కచేయకుండా కేంద్రం ఆదేశాలతో కిరణ్ బేడీ ముందుకు వెళుతున్నారు. ..

  వాస్తవానికి ఢిల్లీలో కేజ్రీవాల్ తరహాలోనే నారాయణస్వామిని టార్గెట్ చేస్తూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో కిరణ్ బేడీ సైతం ఇరుకున పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా యానాంలో అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న కారణంతో రెండ్రోజులపాటు అక్కడే పాగా వేసి మరీ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. దీంతో స్ధానిక ఎమ్మెల్యే, పర్యాటక మంత్రి కూడా అయిన మల్లాడి కృష్ణారావు కిరణ్ బేడీపై భగ్గుమంటున్నారు. కిరణ్ బేడీ పర్యటన సమయంలో నిరసనలు కూడా తెలిపారు. అయినా ఇదేమీ పట్టించుకోకుండా ఆమె తన పర్యటన పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఈ పర్యటన వెనుక యానాం పాలనా వ్యవహారాలపై పట్టుపెంచుకోవాలన్న ఉద్దేశమే ఉందని స్ధానిక అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ అదంత సులువు కాదు. యానాం నుంచి రెండుసార్లు ఇండిపెండెంట్ గానూ, మరో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి నారాయణస్వామి కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న మల్లాడి కృష్ణారావుకు యానాంలో మంచి పట్టుంది.

  ఓ విధంగా చెప్పాలంటే ఆయన మీద పోటీ చేసే గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధి కోసం విపక్ష పార్టీలు ప్రతీసారీ వెతుకుతూనే ఉంటాయి. అదే సమయంలో యానాంలో మల్లాడి అందించే మెజారిటీతో పుదుచ్చేరికి ఉన్న ఏకైక ఎంపీని నిర్దేశించే పరిస్దితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటోంది.దీంతో యానాంను పుదుచ్చేరి నుంచి వేరుచేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కేంద‌్రంలోని బీజేపీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలను పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షం డీఎంకే కూడా ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. ఓవైపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలంగా డిమాండ్ చేస్తుండగా.. ఆ డిమాండ్‌ను పక్కదోవ పట్టించేందుకే యానాంను ఏపీకి ఇచ్చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్, డీఎంకే ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని కామరాజనగర్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఇదే విషయాన్ని మరోసారి లేవనెత్తారు.

  లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ యానాంను పుదుచ్చేరి నుంచి వేరుచేసి ఏపీలో కలిపేందుకు కేంద్రం ఆదేశాలతో పనిచేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలను అమలు చేసేందుకు కిరణ్ బేడీ ప్రయత్నిస్తున్నారు. సీఎం నారాయణస్వామి పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కిరణ్ బేడీ ఈ ప్రయత్నాలను విరమించుకుంటే మంచిది. ఇది యానాంతో పాటు పుదుచ్చేరి ప్రజలను వంచించడమే.'
  ఎంకే స్టాలిన్, డీఎంకే అధినేత

  స్టాలిన్ వ్యాఖ్యలపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా స్పందించారు. యానాం వ్యవహారాల్లో తన తాజా జోక్యంపై మాట్లాడారు. యానాంలో పర్యావరణ చట్టాల ఉల్లంఘన ద్వారా భారీగా ప్రజాధనం వృథా జరుగుతోందన్నారు. యానాంను వరదల బారి నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన తక్కువ ఖర్చుతో కూడిన టైడల్ లాక్ నిర్మాణం కూడా ఆలస్యమవుతోందన్నారు. గోదావరి నది మధ్యలో కాంక్రీట్ కట్టడాల నిర్మాణం సరికాదన్నారు.

  అబద్ధాలను తరచుగా చెప్పడం ద్వారా అవి నిజాలు కావు. గోదావరి నదిలో కాంక్రీట్ కట్టడాల నిర్మాణంపై ఇక్కడి ప్రజలకు సమాచారం కూడా లేదు. నిధుల కొరతతో అల్లాడుతున్న యనాంలో ఐదు కోట్ల రూపాయల ప్రజాధనం వృధాకు ఎవరు అనుమతిచ్చారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇక్కడి అధికారులు నిబంధనలు పాటిస్తే వారికే మంచిది.
  కిరణ్ బేడీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

  యానాం అభివృద్ధి పనుల్లో అక్రమాలకు అక్కడి ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి, ఆయనకు వంతపాడే అధికారులే కారణమని భావిస్తున్న కిరణ్ బేడీ... కేంద్రం ఆదేశాలతో మరికొన్ని కారణాలను సాకుగా చూపుతూ ఏపీలో యానాంను కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు నారాయణస్వామి సర్కారు ఆరోపిస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఇందులో ఏపీలో త్వరగా పట్టు పెంచుకోవాలన్న బీజేపీ ఉద్దేశం కూడా కీలకం కానుంది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Andhra Pradesh, Bjp, Kiran Bedi, Puducherry, Tamilnadu

  ఉత్తమ కథలు