హోమ్ /వార్తలు /national /

ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనంటున్న రాజాసింగ్.. ఎందుకంటే?

ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనంటున్న రాజాసింగ్.. ఎందుకంటే?

ఎమ్మెల్యే రాజాసింగ్ 
(ఫైల్ ఫోటో )

ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫైల్ ఫోటో )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్.. అసెంబ్లీకి రాబోనంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనని స్పష్టం చేస్తున్నారు. ఎందుకో తెలుసా?

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం... అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అహ్మద్‌ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్.. అహ్మద్ ఖాన్‌తో ప్రమాణం చేయనున్నారు. మరుసటి రోజు ప్రొటెం స్పీకర్.. ఎన్నికల్లో గెలిచిన వారితో ప్రమాణం చేయిస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

  అయితే, బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం.. అసెంబ్లీకి రాబోనంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోనంటున్నారు. అందుకు కారణం.. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ ఖాన్‌ ఉండడమేనట. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. హిందువులను అంతం చేస్తానన్న ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎదుట.. తాను ప్రమాణం చేయబోనని స్పష్టం చేశారు. భారత్ మాతాకీ జై అనడానికి, వందేమాతరం అని నినదించడానికి ఇష్టపడని ఎంఐఎం ప్రతినిధిని.. తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని రాజాసింగ్ తప్పుబట్టారు.

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం వారసుడిగా, ఎంఐఎం మద్దతుదారుగా ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఎంఐఎం ఎమ్మెల్యేను తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో సభ నడిచినన్ని రోజులు.. సభకు హాజరు కాబోనని స్పష్టం చేశారు రాజాసింగ్. అధికారులతో మాట్లాడి.. ఎప్పుడు ప్రమాణం చేయాలనే విషయాన్ని నిర్ణయించుకుంటానని చెప్పారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Bjp, CM KCR, MIM, Raja Singh, Telangana, Telangana News

  ఉత్తమ కథలు