హోమ్ /వార్తలు /national /

Dubbaka By elections: దుబ్బాక బీజేపీలో పంచాయతీ.. ఆ నేత సస్పెన్షన్

Dubbaka By elections: దుబ్బాక బీజేపీలో పంచాయతీ.. ఆ నేత సస్పెన్షన్

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)

Dubbaka By elections: రఘునందన్ రావుకు బీజేపీ దుబ్బాక టికెట్ ప్రకటించడంపై బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

  తెలంగాణలో ఉప ఎన్నిక జరగనున్న దుబ్బాక స్థానంపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ గట్టిగా గురి పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో తమ బలాన్ని నిరూపించుకోవాలని చాలా రోజుల క్రితమే డిసైడయిన బీజేపీ.. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టింది. కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన బీజేపీ.. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన రఘునందన్ రావుకు పార్టీ తరపున టికెట్ ఖరారు చేసింది. తనదైన మాట తీరుతో ప్రత్యర్థి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే రఘునందన్ రావు.. కొద్దిరోజుల క్రితం నుంచే ఇక్కడ ప్రచారం మొదలుపెట్టారు.

  దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావడంతో.. తమ పార్టీ తరపున రఘునందర్ రావును అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ నాయకత్వం. అయితే ఈ విషయంలో బీజేపీలోనూ అసంతృప్తి బయటపడింది. అయితే రఘునందన్ రావుకు బీజేపీ దుబ్బాక టికెట్ ప్రకటించడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని సూచించారు. దీని వల్ల బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందని అన్నారు. అయితే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తోట కమలాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ.

  మరోవైపు దుబ్బాకలో టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ టికెట్ ఖరారు చేయగా... ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. దీనిపై నేడు అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక నవంబరు 3న దుబ్బాకలో పోలింగ్ జరగనుంది. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడులయిన నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ 29 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు