POLITICS BJP LEADER AND EX CM DEVENDRA FADNAVIS MAY TAKE OATH AS MAHARASHTRA NEW CHIEF MINISTER TODAY AK
Maharashtra: మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నీవస్.. మరికొద్ది గంట్లోనే ప్రమాణస్వీకారం..
దేవేంద్ర ఫడ్నవీస్ (ఫైల్ ఫోటో)
Maharashtra: ఒక రోజు ముందుగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే ఆయన రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని సమాచారం.
మహారాష్ట్రలో రాజకీయా పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు తీర్పు తరువాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో.. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరడం ఖాయమైంది. దీంతో బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రేపు ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన ఒక రోజు ముందుగానే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రమే ఆయన రాజ్‌భవన్‌లో(Raj Bhavan) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండేలు(Eknath Shinde) రాజ్ భవన్ చేరుకున్నారు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు శివసేన (Shiv Sena) రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయనకు మద్దతుగా నిలిచిన ఏక్నాథ్ షిండే కూడా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
నిన్న రాత్రి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే రాజకీయ పరిణామాలు మారడం మొదలయ్యాయి. ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక కొద్దిరోజులుగా మహారాష్ట్ర వెలుపల ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ రోజు మధ్యాహ్నం ముంబై చేరుకున్నారు.
అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ఏక్నాథ్ షిండే వారితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లోనే రెబల్ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలనే అంశం చర్చకు వచ్చిందని.. ఏక్నాథ్ షిండేకు ఏ రకమైన పదవి ఇవ్వాలనే అంశం చర్చించారని వార్తలు వచ్చాయి. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కలిసి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంతా అనుకున్నా.. సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కోష్యారీ అపాయింట్మెంట్ కోరడంతో.. ఆయన నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం మొదలైంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సభలో బలనిరూపణ చేసుకున్న తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ వెళ్లడంతో మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంతో ముగియనుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.