దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడంలో సక్సెస్ సాధించిన బీజేపీకి తెలంగాణలో పట్టు దొరకడానికి చాలా సమయం పట్టిందనే చెప్పాలి. 2014 నుంచి 2018 వరకు తెలంగాణలో ఆశించిన స్థాయిలో సాధించలేకపోయిన ఆ పార్టీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి తొలిసారి తెలంగాణలో తమకు పట్టు దొరికిందనే అంచనాకు వచ్చింది. ఆ తరువాత పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో హోరాహోరీ పోరు సాధించిన విజయం కాషాయ పార్టీకి పెద్ద బలాన్ని ఇచ్చింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ.. జాతీయ నాయకత్వాన్ని సైతం రంగంలోకి దించింది.
ఎన్నికల ప్రచారం చివరి దశలో స్వయంగా ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. దీంతో తెలంగాణలో పాగా వేయడంపై తాము ఎంతగా ఫోకస్ పెట్టామో బీజేపీ చెప్పకనే చెప్పింది. గ్రేటర్‌లో పట్టు సాధించి తెలంగాణలో బలం పెంచుకోవాలని భావించిన బీజేపీ ప్రయత్నాలు ఫలించాయనే అంశం ఫలితాలను బట్టి అర్థమవుతోంది. జీహెచ్ఎంసీలో పట్టు చిక్కడంతో.. ఇక తెలంగాణలోని మరిన్ని ప్రాంతాల్లో తమ బలం, ప్రాతినిథ్యం పెంచుకోవాలని బీజేపీ అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా అత్యంత కీలక కానుంది.
వచ్చే ఏడాది తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటిని కూడా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పనక్కర్లేదు. గ్రేటర్‌లో పట్టు సాధించి దక్షిణ తెలంగాణలో బలం పెంచుకున్న టీఆర్ఎస్.. ఉత్తర తెలంగాణలో కీలకమైన వరంగల్‌పై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఏడాది కూడా తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ రాజకీయ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, GHMC Election Result, Telangana